calender_icon.png 2 February, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులి.. ఆగని అలజడి!

02-02-2026 12:37:29 AM

భయాందోళనలో పలు గ్రామాల ప్రజలు 

పులిని బంధించేందుకు ఫారెస్ట్ అధికారుల ముమ్మర ప్రయత్నాలు 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు 

పులిని పట్టుకోవాలని స్థానికుల వేడుకోలు

ఆలేరు, ఫిబ్రవరి 1 : ఆలేరు నియోజకవర్గంలో పులి వరుస దాడులతో అలజడి సృష్టిస్తోంది. అధికారులకు, ప్రజలు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మొత్తానికి పులి అలజడితో తుర్కపల్లి, రాజాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట మండలాలకు చెందిన ప్రజలు అనుక్షణం వనికి పోతున్నారు. రైతుల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.               

పులి దాడి ఘటనలెన్నో :         

ఇటీవల తుర్కపల్లి మండలం దత్తాయపల్లిలో పులి  బీభత్సం సృష్టించింది, గొట్టె శ్రీశైలం అనే రైతు పశువులను మేపుతుండగా, అకస్మాత్తుగా దాడి చేసి లేగ దూడను చంపేసింది. పులిని చూసిన పశువులు, రైతులు భయంతో పరుగులు తీశారు. గంధమల్ల దగ్గర ఇంద్రానగర్ లో రెండు నెలల లేగ దూడను చంపి సగభాగము అవయవాలను తినేసింది.  ఈ ఘటన మరికొంత భయాన్ని కల్పించింది. ఇప్పటివరకు ఇబ్రహీంపూర్, రాళ్ళజంగం, దత్తాయపల్లి లో పశువులపై దాడి చేసి పది పశువులను చంపేసింది. రెండు రోజుల్లో వివిధ ప్రాంతాలవద్ద పులి ప్రజలకు కనిపించి భయ భ్రాంతులకు గురిచేస్తుంది 

కొనసాగుతున్న ఆపరేషన్ 

పెద్దపులిని గత 15 రోజులుగా ఫారెస్ట్ అధికారులు గాలిస్తున్నారు. బోనులు ఏర్పాటు, రాత్రి పహారా వంటి చర్యలు చేపట్టినా ఫలితం దక్కడంలేదు. పులి చిక్కకుండా తప్పించుకుంటూ ఉండటంతో ప్రజల్లో అసంతృప్తితో కూడిన భయం పెరుగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆవులు, దూడలపై పులి దాడులు జరిగినట్టు సమాచారం ఉండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫారెస్ట్ అధికారుల ముమ్మర ప్రయత్నాలు

ఈ నేపథ్యంలో పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. పులి సంచరిస్తున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పులిని సురక్షితంగా పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే ట్రాప్ కెమెరాలు, ఫారెస్ట్ సిబ్బంది పహారా, నిఘా వ్యవస్థను మరింత కఠినతరం చేశారు. పులి అడుగుజాడలు కనిపించిన ప్రాంతాలను అధికారులు సీరియస్ గా తీసుకొని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే అదనపు బలగాలను రంగంలోకి దింపుతామని తెలిపారు.

దయ్యబండ తండా, మంచిరోని, మామిల్లు, ఇబ్రాహింపురం, దత్తాయపల్లి, కోనాపూర్, గంధమల్ల, ఇంద్రానగర్ తీర్మాలపురం ప్రాంతాలను బి-అలర్ట్ జోన్గా పరిగణిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ప్రజలకు సూచనలు

రాత్రివేళ పొదలు, బావుల వద్దకు వెళ్ళవద్దని, పశువులను సమూహంగా, వెలుతురు ఉన్న ప్రదేశాల్లో కట్టాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వలనీ గ్రామస్థులు పరస్పరం సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని తెలుపుతున్నారు. ఏది ఏమైనా అధికారులు పులిపై దృష్టిని సారించి దానిని బంధించి ఈ ప్రాంతంలో ప్రజలకు ఏ విధమైన భయాందోళనలు లేకుండా చేయాలని పలువురు కోరుతున్నారు.