09-12-2025 06:47:01 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు శివకుమార్ నాయుడు..
హనుమకొండ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని గ్రామ పంచాయతీ ఎన్నికల హనుమకొండ జిల్లా సాధారణ పరిశీలకులు శివకుమార్ నాయుడు అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మొదటి విడత మండలాల్లో మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసిన అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్, అధికారులతో కలసి ఎన్నికల పరిశీలకులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ ఈనెల 11న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహించే భీమదేవరపల్లి ఎల్కతుర్తి కమలాపూర్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పూర్తి చేసామని తెలిపారు.
ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను ఆర్వోలు వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ సామగ్రిని ఇప్పటికే ఆయా మండల కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. పోలింగ్ రోజున ఈ మూడు మండలాలకు సెలవు దినంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ తనిఖీ చేయాలని ఎంపీడీవోలు, స్పెషల్ ఆఫీసర్లకు ఆదేశించినట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి, ఏర్పాట్లును పరిశీలించి వాటి నివేదికను అందజేయాలని అధికారులకు తెలియజేశామని సమావేశంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు శివకుమార్ నాయుడుకు వివరించారు.
అనంతరం జిల్లా ఎన్నికల పరిశీలకులు శివకుమార్ నాయుడు మాట్లాడుతూ సర్పంచ్, వార్డు స్థానాలకు సంబంధించి ప్రతి వార్డు బ్యాలెట్ పేపర్ ను తనిఖీ చేయాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలని అన్నారు. ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపునకు సరిపోను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లను చేయాలన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, పోలింగ్ అనంతరం కౌంటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.వి. గణేష్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డిఆర్డిఓ మేన శ్రీను, జడ్పీ సీఈవో రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.