calender_icon.png 20 August, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల దర్శనం దివ్యంగా కల్పించాలి

19-08-2025 12:00:00 AM

కలియుగ వైకుంఠమైన తిరుమలేశుడి దర్శనానికి ప్రతి హిందువు అత్యంత భక్తిశ్రద్ధలతో వెళ్తుంటారు. తమ కష్టాలను కడ తీరుస్తాడని అపారమైన నమ్మకం. అలిపిరిలో భద్రతా కారణాల పేరుతో ప్రతి భక్తున్ని, వారి సామాగ్రిని నిశితంగా పరిశీలిస్తారు. ఇది అవసరమైనప్పటికీ పరిశీలన పేరుతో సమయం వృథా చేస్తున్నారు. దీనివల్ల వయోధికులు, స్త్రీలు, పిల్లలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

తిరుమలలోని కేంద్ర రిసెప్షన్ కార్యాలయంలో  గదులు పొందిన తర్వాత వాటి వద్దకు చేరుకునేందుకు చాలా సమయం పడుతుంది. గోవిందుని దర్శనానికి అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపార్ట్‌మెంట్లలో గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు నిర్దిష్ట సమయంలో కాకుండా నిరంతర చర్యగా చేపడితే బాగుంటుంది. మరుగుదొడ్ల నిర్వహణ పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరముంది.

తిరుమలేశుడి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఎలాగైతే క్రమబద్ధమైన చర్యలు తీ సుకుంటున్నారో అదే విధంగా స్వామివారి దర్శనం అనంతరం భక్తులు సాఫీగా బయటకు వెళ్లే వరకు కూడా అదే విధానాన్ని కొనసాగించాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో దర్శనం అనంతరం ఒకేసారి అధిక సంఖ్యలో భక్తులను బయటకి వదిలేస్తుండటంతో విమాన వెంకటేశ్వరుని దర్శనం, ప్రధాన హుండీల్లో కానుకల సమర్పణ చాలా కష్టంగా మారింది. 

భక్తులు దేవాలయం లోపల ఇతర  హుండీలో  కానుకలు సమర్పించేందుకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇది భక్తులకు కాస్త ఊరట కల్పించినట్టవుతుంది. భక్తుల దర్శనార్థం ఎలాంటి అవరోధాలు రాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం.

 రాంచందర్ రావు, హైదరాబాద్