calender_icon.png 20 August, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధమూ - శాంతి

19-08-2025 12:00:00 AM

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుగా తయారైంది ఉక్రెయిన్ పరిస్థితి. నోబెల్ కోసం తహతహలాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాగైనా రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం జరగాలని కంకణం కట్టుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలినెస్కీ, యూరప్ దేశాల నాయకులతో వైట్‌హౌస్‌లో ట్రంప్ సమావేశం కీలకంగా మారింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అలస్కాలో జరిపిన శిఖరాగ్ర సమావేశానికి పొడిగింపుగా ట్రంప్ వైట్‌హౌస్‌లో జెలినెస్కీ, ఇతరులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

శుక్రవారం అలస్కాలో పుతిన్‌కు ఎర్రతివాచీ వేసి స్వాగతం పలికినా, అమెరికా చాలా నాటకీయంగా, చాలా కృతకంగా తన మిలిటరీ బలాన్ని ప్రదర్శించుకొంది. పుతిన్‌తో ట్రంప్ కరచాలనం చేసి ఎర్రతివాచీపై ఇద్దరు నాయకులు నడుస్తున్న సమయంలోనే వారి తలపై నుంచి ఎఫ్-35, బీ-2 స్పిరిట్ బాంబర్ విమానాలు దూసుకెళ్లడం ఎబ్బెట్టుగా కనిపించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణను కాకుండా యుద్ధ విరమణనే కోరుకుంటున్నాయని పుతిన్ అలస్కా సమావేశంలో స్పష్టం చేసినట్టు కనిపిస్తోంది.

అందుకు రష్యాది పైచేయి అయ్యేట్టుగా ఆయన షరతులను ముందుంచి, జెలినెస్కీని, యూరప్ దేశాలనూ ముగ్గులోకి లాగారు. క్రిమియాలో తమ అధీనంలోని ప్రాంతాలను తమకే ఇవ్వాలని జెలినెస్కీ పట్టుబట్టకపోవచ్చునని ఆ తర్వాత ట్రంప్ చెప్పడం, ఇకపై అజెండా రష్యావైపే మొగ్గుచూపుతుందని సంకేతమిచ్చినట్లయింది. నాటోలో సభ్య దేశంగా ఉక్రెయిన్‌కు స్థానం లభిస్తుందనేది కూడా కలగా మారవచ్చు.

నాటో కూటమిలో కలవాలనుకుంటున్న ఉక్రెయిన్‌కు ఆ స్థానం దక్కకూడదనేది పుతిన్ యుద్ధ విరమణకు పెట్టిన షరతుల్లో ఒకటిగా కనిపిస్తున్నది. అలాంటప్పుడు భవిష్యత్‌లో ఉక్రెయిన్‌కు నాటో అండగా ఉండేందుకు ట్రంప్, యూరోపియన్ దేశాలు మార్గాలు అన్వేషిస్తున్నాయి. క్రిమియా ఒక్కటే కాదు, యుద్ధం పరిసమాప్తికి డొనెట్క్, లుహాన్క్ ప్రాంతాల నుంచి కూడా ఉక్రెయిన్ తన సేనలను ఉపసంహరించుకోవాల్సి వస్తుంది.

డాన్‌బాస్ ప్రాంతం పూర్తిగా రష్యా అధీనంలోకి రావాలని పుతిన్ బలంగా పట్టుబడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం పరిసమాప్తికి అనేక సొంత కారణాలతో మధ్యవర్తిత్వం నెరపుతున్న ట్రంప్‌కు ఇది పరీక్షా సమయం. జెలినెస్కీకి ఇక యుద్ధం కొనసాగడం ప్రాణ సంకటంగా మారింది. ఐదో వంతు భూభాగం కోల్పోయేందుకైనా ఆయన సిద్ధపడాల్సిన పరిస్థితి.

రష్యా, యూరప్, అమెరికా మధ్య సమస్య ఇప్పటికైనా పరిష్కారం కాని పక్షంలో మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధం పరిస్థితులను చూడాల్సి వస్తుంది. 2014లో రష్యా ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం రెండు దేశాలకు ఇప్పటికే భారీ నష్టం కలిగించింది. లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గత ౧౧ ఏళ్లుగా విరామం లేకుండా సాగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్ ఆర్థికంగా చితికిపోయింది.

అయితే కొన్ని భూభాగాలను వదులుకొనేందుకు అయినా ఉక్రెయిన్ ఇప్పుడు సిద్ధం కావాల్సిన పరిస్థితి. శాంతిని కోరుకోవాలంటే జెలినెస్కీ ఇందుకు సమ్మతించాల్సి ఉంటుంది. అదే జరిగితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని అంతమొందించడంతో పాటు శాంతిని నెలకొల్పడంలో విజయం సాధించినట్టే.