20-05-2025 12:00:00 AM
31న జలవిహార్‌లో రజతోత్సవ వేడుకలు
ఖైరతాబాద్; మే 19(విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం పాత్ర ఎంతో కీలకమైనదని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం స్థాపించి 25 వసంతాలు గడుస్తున్న సందర్భంగా 31న నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో రజతోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సోమవారం సోమాజి గూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్,టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, ఫోరం సభ్యులతో కలిసి ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం రజతోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
వివిధ ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను, విద్యార్థులను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో టీజే ఎఫ్ కీలకపాత్ర పోషించింది ఆన్నారు. మాక్ అసెంబ్లీ, ఛలో ఢిల్లీ, సాగర హారం, అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాలను చేసిన ఘనత జర్నలిస్ట్ ఫోరందని తెలిపారు. ఉద్యమం చల్లబడ్డప్పు అల్లా టీజే ఎఫ్ కీలకపాత్ర పోషించి ఉద్యమాన్ని ముందుకు నడిపిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ చేసిన ఉద్యమం మిగతా ఉద్యమాలకు ఒక దిక్సూచి లాంటిదని టీజే ఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎ. రమణ కుమార్, పి.శశికాంత్, ఎం.వి.రమణ, కోశాధికారి పి.యోగానంద్, జాయింట్ సెక్రటరి యార నవీన్ కుమార్, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, టీయూ డబ్ల్యూ జే హైదరాబాద్ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు రాకేష్ రెడ్డి, సోమేశ్వర్, కోశాధికారి బాబు రావు, కళ్యాణ్ చక్రవర్తి, ఆగస్టీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.