150 మీటర్ల ఎత్తుకు!
తుమ్మిడిహట్టి నిర్మాణం వేగవంతం చేయాలి
- అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో చర్చించే బాధ్యత మంత్రి ఉత్తమ్‌కు అప్పగింత
- తుమ్మిడిహట్టిపై ఇంజనీర్లు, నిపుణులతో సీఎం, మంత్రి ఉత్తమ్ సమీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం చేపట్టి కార్యాచరణ వేగ వంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ బరాజ్ నిర్మాణం చేప డితే ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణలో మెట్ట ప్రాంతాల రైతులకు సాగు, తాగు నీరు అందుతుందని.. తక్కువ ఖర్చుతో గ్రావిటీపై శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తెచ్చుకునే వీలుంటుందని సీఎం చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం ఎంసీహెచ్‌ఆర్డీలో ఇరిగేషన్ ఇంజనీర్లు, నిపుణులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, ఈఎన్సీ శ్రీధర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుమ్మి డిహట్టి బరాజ్‌ని ఎంత ఎత్తున నిర్మించాలి.. ఎంత ఎత్తు నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుందని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా రు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ మీద ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 11 వేల కోట్లు ఖర్చుచేసిం దని, ఇప్పటికే కొన్ని చోట్ల కాల్వల నిర్మాణం కూడా జరిగిందని.. 71.5 కిలోమీటర్ల కెనాల్ వర్క్ కూడా జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందని, తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు.
ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలన్నిటిని సద్వినియోగం చేసుకునేందుకు 150 మీటర్ల ఎత్తున బరాజ్ నిర్మించాలని నిపుణులు సూ చించారు. గతంలో జరిగిన చర్చల ప్రకారం, మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తు నిర్మించేందుకు అంగీకరించిందని..152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావం ఉంటుందని మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నీటిని తీసుకునే వీలుందని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు.
కిషన్‌రెడ్డికి లేఖ రాయాలి..
తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని, ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సీఎం సూచించారు. సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు.
గురువారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అపాయింట్‌మెంట్ తీసుకొని నేరుగా కలిసి చర్చించే బాధ్యతను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సీఎం అప్పగించారు. తుమ్మిడిహట్టి బరాజ్ అవసరం దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ రైతుల తరపున విజ్ఞప్తి చేయాలని సీఎం సూచించారు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎం అధికారులను అదేశించారు. వానలు పడేలోపు పనులు పూర్తికావాలని మరోసారి స్పష్టంచేశారు.






