ప్రభుత్వ అధికారిక కార్యక్రమ ఫ్లెక్సీలో కనిపించని మంత్రి సురేఖ ఫోటో!?
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఇతర మంత్రుల ఫోటోలు ముద్రించి, జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ఫోటో ముద్రించకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఎమ్మెల్యే పాల్గొన్న అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్,ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఫోటోలు ముద్రించగా, జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడంతో పలువురు కాంగ్రెస్ నేతలు విష్మయానికి గురయ్యారు. ఇటీవల మంత్రి సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన నేపథ్యంలో కావాలనే మంత్రి సురేఖ ఫోటో పెట్టలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.






