24-04-2025 12:35:23 AM
మహబూబ్ నగర్ ఏప్రిల్ 23 (విజయ క్రాంతి) : మంచి చేయాలంటే సమాజంలో యుద్ధం చేయవలసిందిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రోడ్ల భవనాల శాఖ అతిథి గృహ ప్రదేశంలో కొంతవరకు నిర్మించి వదిలేసిన భవనమును పూర్తిస్థాయిలో పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా ఈ మంచి పనులకు శ్రీకారం చుడుతున్న విషయాన్ని తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. అత్యధిక లైబ్రరీ నిర్మించింది గాను ప్రభుత్వం రూ 17 కోట్లు కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం రూ 10 కోట్లు మంజూరు చేసిందన్నారు. త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు శంకుస్థాపన చేసుకుందామని తెలిపారు.
ఎన్టీఆర్ కళాశాల నందు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వీరికి ప్రతిరోజు మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయం నుంచి భోజనం అందిస్తామని వెల్లడించారు. మెట్టుగడ్డ దగ్గర నిర్మించిన టిడి గుట్ట మార్కెట్ అని పేరు పెడుతూ నిర్మించిన భవనమును స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. నాపై నమ్మకం ఉంచి ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకునేలా పనిచేస్తారని స్పష్టం చేశారు. గతంలో ఎవరు ఏం చేశారో ఆలోచించవలసిన అవసరం లేదని ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో అందరం సమిష్టిగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుదామని తెలిపారు.
అంతకుముందు మార్కెట్ యార్డ్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, గుండా మనోహర్, రాజు గౌడ్, దేవేందర్ నాయక్ తదితరులు ఉన్నారు.