- కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాంధీ
- కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎల్పీ విలీనానికి ఆగస్టు 15 డెడ్‌లైన్
- త్వరలో పెద్దఎత్తున చేరికలు
- కాంగ్రెస్‌కు కలిసి వస్తున్న బీఆర్‌ఎస్ మౌనం
హైదరాబాద్, జులై 13 (విజయక్రాంతి): మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హస్తం నీడకు చేరిపోయారు. బీఆర్‌ఎస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో గాంధీకి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతోపాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గాంధీ చేరికతో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. త్వరలోనే మరికొంత మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దశలవారీగా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. జంట నగరాలకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా ఒకరి తర్వాత ఒకరు హస్తం గూటికి చేరుకుంటారని అంటున్నారు.
గ్రేటర్ ఎమ్మెల్యేలంతా క్యూ
గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ సమావైశమైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కొంత కాలం పాటు ఫిరాయింపునకు దూరంగా ఉండి ఎట్టకేలకు శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. మరుసటి రోజే అరికెపూడి గాంధీ ఆయనను అనుసరించారు. త్వరలో మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), బీ లక్ష్మారెడ్డి (ఉప్పల్), వివేకానంద (కుత్బుల్లాపూర్), మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజ్‌గిరి), సుధీర్‌రెడ్డి (ఉప్పల్), సీ మల్లారెడ్డి (మేడ్చల్) సైతం హస్తం గూటికి చేరుకుంటారని ప్రచారం నడుస్తోంది.
బీఆర్‌ఎస్ ఎల్పీ విలీనానికి మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతుండగా.. అంతకంటే ఎక్కువగానే పార్టీ ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ వీడి వెళ్లిపోయే వారిని బీఆర్‌ఎస్ అధిష్ఠానం సైతం పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడంలేదు. అందుకే ఎమ్మెల్యేలు గేట్లు తెరిచినట్లుగా కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు కేసీఆర్ సైతం ఈ ఫిరాయింపులపై మౌనంగా ఉండటంతో వెళ్లేవారికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందని చర్చ నడుస్తోంది. సాధ్యమైనంత త్వరగానే బీఆర్‌ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ విజయంతం అయ్యేలాగే కనిపిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డితో గూడెం భేటీ?
పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరికపై చర్చించినట్లు పుకార్లు వినిపించాయి. త్వరలోనే ఆయన కూడా హస్తం గూటికి చేరుకుంటారని అంటున్నారు.
కాంగ్రెస్ ఏం తాయిలం ఇస్తోంది?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్న ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేస్తోందని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారని, అలాగే తెలంగాణలో ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్ వారికి ఏం తాయిలం ఇస్తోందని ‘ఎక్స్’ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎంత ధర నిర్ణయించారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్ కలెక్షన్లు ఆర్‌ఆర్‌ఆర్, కల్కి సినిమాల కలెక్షన్లను మించిపోయా యని ఆరోపించారు.