పాలేరు పెద్ద కాలువలోకి దూసుకెళ్ళిన ట్రాక్టర్..
ధైర్యసాహసంతో ట్రాక్టర్ ను బయటకు తెచ్చిన సర్పంచ్..
సర్పంచ్ కు అభినందనలు వెల్లువ
కూసుమంచి ఏప్రిల్ 10 (విజయక్రాంతి): పాలేరు ఎన్‌ఎస్పీ కాలువ ఉదృత్తంగా ప్రవహిస్తుంది.. ఈ క్రమంలో ఓ ట్రాక్టర్ కాలువలోకి దూసుకెళ్లింది.. కాలువ నిండా నీళ్ళు ప్రవహిస్తుండటంతో ట్రాక్టర్ మునిగిపోయింది. దీంతో డ్రైవర్ ప్రాణాలను అరిచేతులో పెట్టుకుని ఈత ద్వారా సురక్షితంగా బయటకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ ధైర్యసాహసాలతో కాలువలోకి దూకి ట్రాక్టర్ ను జేసీబీ సహాయంతో బయటకు తీసుకొచ్చాడు. దీంతో సర్వత్ర ప్రశంసలు వెళ్లివెతుతున్నాయి.
ఈ సంఘటన శుక్రవారం మల్లాయిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ శివారు హట్యతండా సమీపంలోని పాలేరు ఎన్‌ఎస్పీ కెనాల్ లోకి ట్రాక్టర్ ప్రమాదవశాత్తు దూసుకుపోయింది. కాలువ నిండుగా ప్రవహిస్తుండటంతో ట్రాక్టర్ కాలువలోకి మునిగిపోయింది.
బతుకుజీవుడా అనుకున్న డ్రైవర్ అప్రమత్తమై ట్రాక్టర్ నుంచి దూకి ఈత ద్వారా సురక్షితంగా బయటకు వచ్చాడు. ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ బాదావత్ నరేష్ స్థానికులతో పాటు అధికారులకు సమాచారం అందించారు. జేసీబీని ఏర్పాటు చేసిన సర్పంచ్ నరేష్, స్వయంగా ధైర్యసాహసాలు చేసి కాలువలోకి వెళ్ళి, నీటిలో మునిగి ట్రాక్టర్ కు గొలుసులు కట్టి అతికష్టం మీద బయటకు తీశాడు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి ఆ ట్రాక్టర్ ను బయటకు తీసుకురావడంతో స్థానికులు సర్పంచ్ ను అభినందించారు. ట్రాక్టర్ లోకి వాటర్ పోవడంతో యజమానికి తీవ్రనష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.




