6 August, 2026 | 2:32 AM

ఈ నెలలోనే రెండో గోదావరి వంతెనపై రాకపోకలు

06-08-2026 01:17 AM

రిటైనింగ్ వాల్‌తో అప్రోచ్ రోడ్డు రక్షణ

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

బూర్గంపాడు, ఆగస్టు5, (విజయక్రాంతి): భద్రాచలంలోని గోదావరి రెండో వంతెనపై ఈ నెలలోనే రాకపోకలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల వరదల కారణంగా కోతకు గురైన వంతెన అప్రోచ్ ప్రాంతంలో చేపడుతున్న పునరుద్ధరణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు.

పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, నాణ్యత ప్రమాణాలతో వేగంగా పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోగా వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. భవిష్యత్తులో వరదల వల్ల అప్రోచ్ రోడ్డు దెబ్బతినకుండా పటిష్ఠమైన రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.దేశ విదేశాల నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ, గోదావరి పుష్కరాలు, శ్రీరామనవమి కల్యాణోత్సవాల సందర్భంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రెండో వంతెన నిర్మాణం చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.

2015 గోదావరి పుష్కరాల సందర్భంగా ఒకే వంతెన ఉండటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో పనులు నత్తనడకన సాగగా, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మాణాన్ని వేగవంతం చేసి పూర్తి చేసిందని తెలిపారు.

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రెండో వంతెన పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని చెప్పారు.రెండో వంతెన వినియోగంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు భద్రాచలం మీదుగా ప్రయాణించే వాహనదారులకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,సారపాక, భద్రాచలం సర్పంచులు గుగులోత్ కిశోర్నాయక్, పూనెం కృష్ణ, సారపాక ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్, ఎస్‌ఏ సమీర్, తిరుపతి చంటి, ఐటీసీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్, సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు.