పారదర్శకంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ
కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటర్ కు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కంబాలపల్లిలో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోలు ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలని అన్నారు. ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఏఈఆర్‌ఓ రాజేశ్వర్ రావు, బిఎల్‌ఓ సూపర్వైజర్ జి.కవిత, బిఎల్వో పి.కనక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






