బస్సులో గుడుంబా రవాణ
ములుగు, మహబూబాబాద్ జులై 5 (విజయక్రాంతి): చతిస్గడ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ప్రైవేటు బస్సులో అక్రమంగా గుడుంబా రవాణా చేస్తున్న ఘటన వెలుగు చూసింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు స్టేషన్ పరిధిలో టేకులగూడెం వద్ద 163వ జాతీయ రహదారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పేరూరు ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీ చేస్తున్న క్రమంలో చతిస్గడ్ నుంచి వచ్చే ప్రైవేటు ట్రావెల్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గుడుంబాను గుర్తించారు.
ధర్మవరం గ్రామానికి చెందిన జనగామ రమణ, కావిరి జయ ఇద్దరు మహిళలు 210 లీటర్ల గుడుంబాను చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు తీసుకొని వస్తున్నట్లు నిర్ధారించారు. లక్ష రూపాయల విలువైన గుడుంబా అక్రమ రవాణాకు బస్సు డ్రైవర్ ఉమేష్ కుమార్ యాదవ్, క్లీనర్ రమేష్ గౌడ్ సహకరించినట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సులు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.






