01-01-2025 12:00:00 AM
దీనిని బృహత్కిన్నెర అంటారు. గిరిజన జాతుల కిన్నెరగా ప్రసిద్ధి. తెలంగాణలోని గోండి, చెంచు గిరిజనులు దీనిని వాడతా రు. అయితే చెంచు సమాజంలో ఇప్పుడు కిన్నెర లభ్యం కావడం లేదు. గోండి సమాజంలో కేవలం ఇద్దరు మాత్రమే దీనిని వాయిస్తున్నారు. ప్రాచీన, మధ్య యుగాల లో కిన్నెర అత్యంత ప్రచారంలో గల తంత్రీవాద్యం.
దీనిని గుండెల (వక్షస్థలం) మీద పెట్టుకుని వాయిస్తారు. రెండు నుండి నాలు గు ఆనపకాయ బుర్రలుగా అమరుస్తారు. వీటి కింద కొంత భాగం కోసి ఉంటుంది. కిన్నెరలో రెండు తీగలు ఉంటాయి. ఒకటి ఆధార శ్రుతి. మరో తీగ శబ్దం పలికిస్తుంది. కుడి చేత్తో మీటుతూ, ఎడం చేత్తో మెట్ల మీద వేళ్ళతో తంత్రులు మీటుతారు.
గోండి కిన్నెర వాద్యం వాయిస్తూ పహండికూపలింగాల్ అనే భక్తుడు 18 పాటలను 18 గతులలో వాయించాడట. ఈ కిన్నెర గురించి అయిదో శతాబ్దానికి చెందిన మాతంగుని ‘బృహద్దేశి’ గ్రంథంలో, అబుల్ ఫజల్ రాసిన ’అయినీ అక్బరీ’ గ్రంథంలో ప్రసక్తించబడింది. మనదేశంలో వివిధ ప్రాంతాలలో గల అనేక శిల్పాలలో ఈ వాద్యం కనిపిస్తూ ఉంటుంది.
మెట్ల కిన్నెర అనేక జిథర్ వాద్యాలకు తల్లి వంటిది. ఆ తరువాత ఎన్నో వాద్యాలకు మాతృక. కిన్నెర తయారీని బట్టి, రకాన్ని బట్టి అటవీ ప్రాంత, మైదాన ప్రాంత కిన్నెరలుగా పిలవబడ్డాయి. పన్నెండు మెట్ల చెంచుల కిన్నెర అదృశ్యం కాగా, గోండుల కిన్నెర అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది.