ఆచార్య జయశంకర్, గద్దర్‌కు మంథనిలో ఘన నివాళులు
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చిరస్థాయిగా నిలబెట్టిన మహనీయులని కొనియాడిన కాంగ్రెస్ నాయకులు
మంథని,(విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్, గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇద్దరూ తమ జీవితాలను అంకితం చేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి ఆచార్య జయశంకర్ సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేయగా, గద్దర్ తన విప్లవ గీతాలతో ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించారని పేర్కొన్నారు.
మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఆర్టీఏ సభ్యుడు మంథని సురేష్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి జీవితాంతం మార్గదర్శకుడిగా నిలిచారని, విద్యావేత్తగా, ఉద్యమకారుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అలాగే గద్దర్ తన పాటల ద్వారా సామాజిక చైతన్యం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రజల్లో నింపి ఉద్యమానికి విశేష బలాన్ని చేకూర్చారని గుర్తు చేశారు.






