ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు భావితరాలకు ఆదర్శం
– ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు
ఉట్నూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు భావితరాలకు ఆదర్శప్రాయమని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు పేర్కొన్నారు. గురువారం ఉదయం ఉట్నూర్‌లోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రాజెక్టు అధికారి మంద మకరందు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఐటీడీఏ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆయన చేసిన పరిశోధనలు, ఉద్యమం, త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి కోసం విద్య, సామాజిక చైతన్యం, ప్రజా సంక్షేమం ఎంతో కీలకమని ఆయన బోధించిన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్యా విస్తరణ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన వంటి అంశాలలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో సేవలందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.






