ట్రిపుల్ ఆర్ బాధితులు అరెస్టు
- ఇందిరా భవన్‌ను ముట్టడించిన రైతులు
- మంత్రి కోమటిరెడ్డిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం ట్రిపుల్ ఆర్ బాధితులను పోలీసు అరెస్టు చేయడం వివాదాస్పదమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన వివిధ కార్యక్ర మాలకు శనివారం హాజరైన రోడ్లు భవనాలు, సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసేందుకు నాంపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన ట్రిపుల్ ఆర్ బాధితులు గడియారం సెంటర్ లోని ఇందిరా భవన్‌కు చేరుకున్నారు.
దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బాధిత రైతులను బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాము ఉగ్రవాదులు కామని భూములు పోతుంటే మంత్రిని కలిసి బాధలు చెప్పుకుందామంటే పోలీసులు తమపై బల ప్రయోగం చేయడం ఏమిటని రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమకు మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. అప్పటివరకు పనులను సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు.






