14-09-2025 12:28:49 AM
రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఇంజినీర్లు, వక్తలు
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి) : తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే జీవధార అని రిటైర్డ్ ఇంజినీర్లు, వక్తలు అభిప్రాయ పడ్డారు. సీనియర్ జర్నలిస్టు ఎ.రమణ కుమార్ అధ్యక్షతన సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ‘గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు రిటైర్డ్ ఇంజినీర్లు, వక్తలు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ నీళ్లపై కుట్ర జరుగుతున్నదని, ఇందులో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ లు భాగమని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను బూచీగా చూపి గోదావరి జలాలను బనకచర్లకు తరలించుకు పోయేందుకు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రిటైర్డ్ ఇంజనీర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ... మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు కాలువల ద్వారా, టన్నెల్ ద్వారా కానీ నీటిని తరలించే అవకాశం లేనందునే అన్నారం, సుందిళ్ల రిజర్వాయర్లను నిర్మించాల్సి వచ్చిందన్నారు.
పీసీ ఘోష్ కమిషన్‌కు తాము ఇచ్చిన నివేదికను తొక్కి పెట్టారని తెలిపారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ ఎల్లంపల్లి నుంచి నీటిని వాడుకునే అవకాశం ఉన్నా మేడిగడ్డ నిర్మిచారని తెలిపారు. భూమి, నీటి కోసం లక్షల కోట్లు ఖర్చు చేసినా తప్పులేదని, కానీ ప్రజాధనం వృథా కావొద్దని సూచించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నీటి పారుదల రంగ నిపుణులు వీ.ప్రకాష్, సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, సీపీఐ నేత పశ్య పద్మ, మాజీ జెడ్పీటీసీ సంజీవ్ నాయక్, సీనియర్ జర్నలిస్టులు నర్రా విజయ్, శివారెడ్డి, రాము, హెస్సేన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.