calender_icon.png 24 May, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్‌పై పట్టుబిగించిన ట్రంప్

24-05-2025 02:03:08 AM

- అమెరికా బయట తయారయ్యే యాపిల్ ఫోన్లపై 25శాతం సుంకాలు

- ఇప్పటికే సీఈవో కుక్‌కు తన వైఖరి తెలిపానన్న ట్రంప్

-ఈయూపై 50 శాతం సుంకాలు

ముంబై, మే 23: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఇప్పటికే సుంకాలతో ప్రపంచాన్ని గడగడలాడిస్తు న్న ట్రంప్ తాజాగా అమెరికా బయట తయారయ్యే ‘యాపిల్’ ఉత్పత్తులపై కొత్త సుంకాలు వడ్డించనున్నట్టు వెల్లడించా రు. ఒక వేళ యాపిల్ ఫోన్లు అమెరికా బయట తయారయితే ఆ ఐఫోన్లపై అదనంగా 25 శాతం సుంకాలు విధించనున్నట్టు తన సొం త సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్ట్ చేశారు. 

ఇప్పటికే కుక్‌కు చెప్పా.. 

యాపిల్ సీఈవో టిమ్ కుక్‌కు ఇప్పటికే తన వైఖరి గురించి వెల్లడించానని ట్రంప్ పేర్కొన్నారు. ‘అమెరికాలో అమ్ముడయ్యే అన్ని ఐఫోన్ మోడల్స్ అమెరికాలోనే ఉత్పత్తి అవ్వాలని భావిస్తున్నా. భారత్‌లో లేదా మరే ఇతర దేశంలో తయారవకూడదని అనుకుంటున్నానని ఇప్పటికే యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌కు తెలియజేశా. ఒక వేళ అమెరికాలో విక్రయించే ఐఫోన్లు అమెరికా బయట తయారయితే వాటిపై 25శాతం సుంకాలను యాపిల్ తప్పకుండా అమెరికాకు చెల్లించాలి.’ అని పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రకటనతో యాపిల్ షేర్లు ఒక్కసారిగా ఢమాల్‌మన్నాయి. ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో ఆ కంపెనీ షేర్లు 2శాతం కన్నా ఎక్కువగా పతనం అయ్యాయి. 

భారత్‌కు దెబ్బే! 

ఇటీవలి కాలంలో యాపిల్ కంపెనీ ఇండియాలో తన ఉత్పత్తులను ఎక్కువ మొత్తంలో తయారు చేస్తోంది. తాజాగా ట్రంప్ విధించిన సుంకాలు యాపిల్ కంపెనీ నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి. యాపిల్ కంపెనీ చైనా నుంచి క్రమక్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తోంది. ఇటీవల అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య పరిస్థితులు వల్ల కూడా కంపెనీ ఈ దిశగా అడుగులు వేసింది. ట్రంప్ తాజా ఖతార్ పర్యటనలో కుక్‌తో సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలోనే భారత్‌లో యాపిల్ పెట్టుబడులపై ట్రంప్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. భారత్‌లో పెట్టుబడులు తగ్గించాలని, భారత్ తనను తాను చూసుకోగలదని మే 15న ట్రంప్ కుక్‌తో వ్యాఖ్యానించినట్టు సమాచారం. యాపిల్ కంపెనీ భారత్‌లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో మొత్తం ఉత్పత్తిలో 25 శాతం ఫోన్లు భారత్ నుంచే తయారు చేయాలని యాపిల్ చూస్తోంది.

తద్వారా చైనాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో కంపెనీ ప్రణాళికలు అస్తవ్యస్తం అయ్యాయి. మార్చి 2025 వరకు కంపెనీ 22 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ గల ఐఫోన్లను భారత్‌లో ఉత్పత్తి చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 60శాతం ఎక్కువ. 

అమెరికాలో పెరగనున్న ఐఫోన్ ధరలు!

డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా అమెరికాలో అమ్ముడయ్యే ఐఫోన్లన్నీ అమెరికాలోనే ఉత్ప త్తి చేయడం అంత సులభం కాదు. ఇలా తయారు చేసినా కానీ ఆ ఫోన్ల ధరలు కనీసం 25శాతం మేర పెరిగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మే మొదట్లో యాపిల్ కంపెనీ మొదటి క్వార్టర్ ఫలితాలను విడుదల చేసిం ది. ‘ఎక్కువ మొత్తంలో ఐఫోన్లు అమెరికాలో అమ్ముడు పోయాయి. ఆ ఐఫోన్లు భారత్‌లో తయారయ్యాయి.’ అని యాపిల్ సీఈవో కుక్ ఈ ఫలితాల గురించి విశ్లేషించారు. 

ఈయూపై కొరడా

ఈయూ దేశాలపై 50 శాతం సుంకాలు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. జూన్ 1 నుంచి కొత్త టారిఫ్ విధానం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ యూ యూనియన్‌తో జరిపిన చర్చ లు నిస్సారంగా ముగిశాయని.. అం దుకోసమే ఈ సుంకాలు విధిస్తున్న ట్టు పేర్కొన్నారు. ఈ యూనియన్ అమెరికన్ కంపెనీలపై ఇష్టారాజ్యంగా జరిమానాలు వేసిందని ట్రంప్ ఆరోపించారు.