04-10-2025 09:56:00 PM
3.2 క్వింటాళ్ల బియ్యం, రెండు స్కూటీలు స్వాధీనం..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేసే రాయితీ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని పట్టుకొని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ లోని బొక్కలగూడలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నరనే పక్క సమాచారంతో తనిఖీ చేయగా బియ్యాన్ని తరలిస్తున్న షేక్ ఫైజన్, అబ్దుల్ సత్తార్ లను శనివారం అరెస్టు చేశామన్నారు. వారి నుండి 3.2 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు.
అదేవిధంగా రెండు స్కూటీలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. రేషన్ డీలర్లు అక్రమంగా రాయితీ బియ్యాన్ని దుర్వినియోగం చేసిన, అధిక ధరలకు అమ్మిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ప్రజలు తరచూ రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే రేషన్ కార్డు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోబడతాయన్నారు. అదేవిధంగా ప్రజలు అధిక ధరలకు అమ్ముకోవడానికి రేషన్ బియ్యాన్ని జమ చేసే వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతుందని పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. దాడిలో ఎస్సై రమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.