calender_icon.png 25 August, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెంగ్యూతో ఇద్దరు మృతి

25-08-2025 01:52:46 AM

- 60 మందికి విషజ్వరాలు

- సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో ఘటన

- ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు

- గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ హైమావతి

జగదేవ్‌పూర్, ఆగస్టు 24: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్‌లో డెంగ్యూ, విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లోనే డెంగ్యూతో నాయిని శ్రావణ్‌కుమార్ (17), కొంతం మహేశ్(32) మృతిచెందారు. మరో 60 మందికి పైగా వైద్యం పొందుతున్నారు. కాగా గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు కొరవడటంతో మురుగు నీటిలో దోమల వృద్ధి పెరిగిపోయి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మండల అభివృద్ధి అధికారి రామ్‌రెడ్డి తిమ్మాపూర్ గ్రామానికి ప్రత్యేక అధికారి అయినా పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించి, జ్వరంతో ఉన్నవారికి డెంగ్యూ పరీక్ష నిర్వహించాలని వైద్యాధికారులను కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు. ఆదివారం గ్రామంలో వైద్య శాఖ, గ్రామపంచాయతీ ఇతర అధికారులతో కలిసి డెంగ్యూ నివారణ చర్యలను క్షేత్రస్థా యిలో కలెక్టర్ పరిశీలించారు.

గ్రామంలో వైద్యం చేస్తున్న అర్‌ఎంపి రమేశ్ క్లినిక్ సీజ్ చేసి అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిఎం అండ్‌హెఓను ఆదేశించారు. డెంగ్యూతో మృతి చెందిన నాయిని శ్రావణ్ కుమార్ (17), కొంతం మహేష్ (32) గృహాలకు వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వ్యాధిగ్రస్తులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డిపిఓ దేవకిదేవి,  డిఎం అండ్ హెఓ ధనరాజ్, ఎంపీడీవో రామ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.