ఆగస్టుకు ముందే రూ.2 లక్షల రుణమాఫీ
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27(విజయక్రాంతి): ఆగస్టుకు ముందే రైతు రుణమాఫీ రూ.౨ లక్షల చేసి చూపుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. ప్రజాభిప్రాయం సేకరించి, విధివిధానాలు రూపొందించి అసెంబ్లీలో చర్చంచి రైతు భరోసా అమలు చేస్తామని ఉద్ఘాటించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తాగునీరు, రహదారులకు సంబంధించిన పలు అభివృద్ది పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో భట్టి మాట్లాడుతూ.. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వదని గత పాలకులు ప్రచారం చేశారని, తాము రైతుల ఖాతాల్లో డబ్బులు వేసి చూపించామని అన్నారు. ఇప్పుడురుణమాఫీ చేయరని అంటున్నారని.. దానినీ అమలు చేసి చూపిస్తామని స్పష్టంచేశారు. గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రూ. 42 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టారని, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారని మండిపడ్డారు. అయినా, ఇంటింటికీ తాగునీరు ఇవ్వలేక పోయారని ఆరోపించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రజల డబ్బును ఇష్టానురీతిగా పంచుకున్నారని విరుచుకుపడ్డారు.
గత ప్రభుత్వ వైఫల్యంతోనే కొత్తగూడెం పట్టణానికి రూ.150 కోట్లతో మళ్లీ తాగునీటి పథకం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రూ.౭ లక్షల కోట్లు అప్పులు చేసి పారిపోయారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. ప్రణాళికబద్ధంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల ను పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలో సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు పారించి పంటలకు సాగు నీరందిస్తామని వెల్లడించారు. ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటామని, పైసాపైసా పోగుచేసి సంపదను సృష్టిస్తామని.. ఈ సంపదను రాష్ట్ర ప్రజలకు పంచుతామని స్పష్టం చేశారు.
కొత్తగూడెంకు బైపాస్
కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటే తప్పకుండా మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి స్థల సేకరణ పూర్తయ్యిందని, నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధులు మంజూరు చేశారని చెప్పారు. కొత్తగూడెంకు ఐటీ హబ్ నిర్మాణానికి కావలసిన స్థలం ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యంతో చర్చిస్తామని, టైర్ టు సిటీ పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం అభివృద్ధికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో మాట్లాడి ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పామాయిల్‌కు కేరాఫ్ కొత్తగూడెంగా మారుద్దాం : మంత్రి తుమ్మల
పామాయిల్‌కు కేరాఫ్ కొత్తగూడెంగా మారుద్దామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు అన్నారు. ఇందుకోసం జిల్లాలోని అధికారులంతా సమన్వయంతో ముందుకు పోతూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మంలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించానని చెప్పారు. సీతారామప్రాజెక్టు పంపుహౌస్ ఫేస్1ను ప్రారంభిచామని, ప్రాజెక్టు నిర్మాణం భూముల ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ నుంచి భద్రాచలానికి మరో జాతీయ రహదారి: మంత్రి కోమటిరెడ్డి
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జీ మంత్రి, రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు జాతీయ రహదారి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో అనుమతి తీసుకొన్నామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రూ.20,200 కోట్లతో హైదరాబాద్ నుంచి భధ్రాచలం వరకు మరో జాతీయ రహదారి ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రీడిజైన్ పేరుతో రూ 9వేల కోట్లు బూడిదపాలు: పొంగులేటి
గత పాలకులు సీతారామ పేరుమార్చి వ్యయం పెంచేశారని, రూ 9వేల కోట్లు వెచ్చించి బూడదలో పోసిన పన్నీరులా చేశారని రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
గోదావరి వరదల సమయంలో ఒక్క ప్రాణ నష్టం జరుగకుండా అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో గోదావరి వరదల సంసిద్ధత, సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. వరదల్లో ప్రభుత్వం చేసే ప్రతి సహయం ప్రజల్లో మనోదైర్యాన్ని నింపాలని అన్నారు. తగినన్ని లాంచీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలతో పాటు నిత్యావసర సరుకులను నిల్వచేయాలని కోరారు. విద్యుత్తు సమస్య తలెత్తినప్పుడు వెంటనే పునరుద్దరించేలా అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రోడ్లు భవనాలశాఖ, పంచాయతీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ డ్రైనేజీలు, రోడ్లు త్వరితగతిన మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపముఖ్యమంత్రి భట్టి




