పీవీ విగ్రహం.. మాటలకే పరిమితం
- మూడేండ్ల క్రితం శత జయంతి సందర్భంగా ఆర్భాటంగా పనులు షురూ
ఆ తర్వాత పట్టించుకోని పాలకులు, యంత్రాంగం
ముద్దుబిడ్డకు దక్కని గౌరవం
కరీంనగర్, జూన్ 27 (విజయక్రాంతి): కరీంనగర్ ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహ ఏర్పాటు మాటలకే పరిమితం అయ్యింది. పీవీ శత జయంతి వేడకుల సందర్భంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘనంగా జరిపింది. 2020 జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు ఏడాది పాటు ఉత్సవాలను నిర్వహించింది. శతజయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ నరసింహారావు విద్యనభ్యసించిన మల్టీ పర్పస్ పాఠశాల ఆవరణలో ప్రధాన రోడ్డుకు ఎదురుగా తెలంగాణ చౌక్ సమీపంలో విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు.
స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా మల్టిపర్పస్ పాఠశాలను పార్కుగా అభివృద్ధి చేస్తున్న క్రమంలో పీవీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అప్పటి నేతలు పీవీ మన ఠీవి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి సంవత్సరంలోగా కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటనలు గుప్పించారు. అయితే నేటికి విగ్రహ ఏర్పాటు జరగలేదు. విగ్రహం ఏర్పాటు కోసం పిల్లర్‌ను సిద్ధం చేశారు. కానీ, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆసక్తి నాటి పాలకులు చూపించలేదు.
ఉత్సవ కమిటీ చైర్మన్‌గా కేకే
నాటి ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడు కే కేశవరావును శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 12 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని కరీంనగర్‌కు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే శతజయంతి ఉత్సవాలు పూర్తయి ఇప్పుడు 103వ జయంతి జరుగుతున్న తరుణంలో పీవీ నరసింహారావు విగ్రహం గురించి స్పందించకపోవడం విచారకరం. ఒక పక్క పార్కు పనులు చకచక జరుగుతున్నాయి. విగ్రహ ఏర్పాటు స్థలం వద్ద వాల్ నిర్మాణం పూర్తయింది. కానీ విగ్రహ విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ విగ్రహ పనులకు భూమిపూజచేశారు. ఆ తర్వాత ఉత్సవ కమిటీ ద్వారా విగ్రహన్ని తీసుకురావడంలో శ్రద్ధ చూపలేదు.
ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్
పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నుంచి దేశ ప్రధానిగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రస్తుత పాలకులైనా ఆయనను గౌరవించి విగ్రహ ఏర్పాటులో చొరవ చూపాలని స్వాతంత్య్ర సమరయోధులు కోరుతున్నారు. ఇక్కడి విగ్రహ స్థాపన సంగతి ఇలా ఉంటే శతజయంతి ఉత్సవాలకు ముందే మానేర్ డ్యాం సమీపంలోని ఉజ్వల పార్కుకు పీవీ నరసింహారావు పార్కుగా నామకరణం చేశారు. పార్కు లోపల చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయనను గౌరవించి పార్కుకు పేరు పెట్టడం, విగ్రహాన్ని ఏర్పాటు చేయడం బాగానే ఉన్న ఆయన శతజయంతి తర్వాత విగ్రహానికి నగరపాలక సంస్థ రంగులు వేయడమే మరిచింది.
కరీంనగర్‌లో కాంస్య విగ్రహం ఏర్పాటుపై నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌రావును ‘విజయక్రాంతి’ ప్రశ్నించగా నగరపాలక సంస్థ నిధుల ద్వారా మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసే అధికారం ఉంటుందని, పీవీ విగ్రహ ఏర్పాటు స్థలంలో స్మార్ట్ సిటీ నిధుల నుంచి పనులు చేపట్టామని తెలిపారు. అప్పుడు శతజయంతి ఉత్సవ కమిటీ విగ్రహాన్ని అందిస్తామని మాట ఇచ్చిందని, ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. డివిజన్ కార్పొరేటర్ వాల రమణారావుతోపాటు ఇదే డివిజన్‌లోని బ్రాహ్మణ సంఘాలు పీవీ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్‌కు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిన పీవీని గౌరవించవలసిన అవసరం ఉందని, ఆయన జ్ఞాపకాలను పదిలపర్చినప్పుడే ఆయనకు ఘన నివాళి ఆర్పించిన వారమవుతామని బ్రాహ్మణ సంఘం నాయకుడు దీపక్‌బాబు తెలిపారు.




