రైతులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులు రిమాండ్
ఉట్నూర్,(విజయ క్రాంతి): ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగ గ్రామానికి చెందిన గిరిజన రైతులను ఎర్రచందనం మొక్కల సరఫరా పేరుతో మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఉట్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మడవి ప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు చెందిన తన్నీరు హేమంత్ కుమార్, ముద్దిరాల ఆనంద్ లు ఇంద్రవెల్లి మండలం డోంగర్గావ్ గ్రామానికి చెందిన పలువురు గిరిజన రైతుల వద్దకు వచ్చి ఎర్రచందనం మొక్కలు సాగు చేస్తే లాభాలు ఎక్కువ ఉంటాయని నమ్మించి వారి వద్ద రూ.5.20 లక్షలు తీసుకొని మొక్కలు సరఫరా చేయకుండా పారిపోయారని అన్నారు.
ఎర్రచందనం మొక్కలతోపాటు మొక్కల రక్షణకు ఫెన్సింగ్ వైర్, సీసీటీవీలో ఏర్పాటు చేస్తామని రైతులను వారు నమ్మించారు. రైతులను నమ్మించి రెండేళ్ల పాటు మొక్కలు సరఫరా చేయకుండా రైతులను తిప్పుకున్నారని ఎస్సై వివరించారు. ఎర్రచందనం మొక్కల పేరుతో మోసం చేసిన రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి వారిని తిరుపతిలో అరెస్టు చేసి తీసుకువచ్చామని సీఐ తెలిపారు. తిరుపతి నుండి తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులను ఉట్టోర్ కొడుకు రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. ఆయనతోపాటు ఎస్సై సాయన్న , పోలీసులు పాల్గొన్నారు.






