21-01-2026 01:42:02 AM
ఫోర్త్ సిటీ అభివృద్ధికి తెలంగాణతో కలిసి పనిచేస్తాం
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి) : స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు లో తెలంగాణ సర్కార్ తొలి విజయం సాధించింది. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపం చస్థాయి నగరంగా అభివద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి సిద్ధం గా ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్‌ఈ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక -2026 సద స్సులో భాగంగా దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో యూఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు.
‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ర్టంలో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ ను వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ఇది దేశంలోనే తొలి నెట్- జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. సుమారు 30 వేల ఎకరాల్లో విస్తరించే ఈ నగరంలో ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాస, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వివరించారు.
ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే మారుబేని, సెమ్ కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని, ఇటీవలే రిలయన్స్ గ్రూప్ వంతారాతో ఫ్యూచర్ సిటీలో కొత్త జూ ఏర్పాటు కో సం అవగాహన ఒప్పందం కుదిరిందని సీ ఎం వెల్లడించారు. తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మా ర్రీ తెలిపారు.
ప్రాజెక్ట్ వేగవంతమయ్యేందుకు రెండు ప్రభుత్వాల అధికారులతో సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్‌తో తెలంగాణ కలిసి పనిచేసి గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
ఏఐతో సమర్థవంతంగా పౌర సేవలు : సీఎం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మ రింత సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక ఆధ్వర్యంలో దావోస్‌లో నిర్వహించిన ‘ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కంపెటిటివ్ నెస్’ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రే వంత్ రెడ్డి మాట్లాడుతూ..
రైతు భరోసా వం టి సబ్సిడీల ట్రాకింగ్ నుంచి మొదలుకుని ఆస్తి పన్ను వసూళ్లు, మహిళలకు అందించే సంక్షేమ పథకాల అమలు, పట్టణ మున్సిపల్ సమస్యల పరిష్కారం వరకు అనేక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను తెలంగాణ ప్ర భుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏఐని సరైన దిశలో వినియోగిస్తే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందన్నారు. హైదరాబాద్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మా రిందని, అన్ని రంగాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నా రు.
ఈ సదస్సులో స్మార్ట్ ఫ్యాక్టరీలు, స్థిరమైన ఇం ధన వ్యవస్థలు, ఏఐ ఆధారిత సేవలు, స్మార్ట్ సిటీల నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలపై చర్చించారు. సమావేశంలో ఈజిప్ట్ పెట్టుబడులు, విదేశీ వాణిజ్య మంత్రి హస్సన్ ఎల్కహతీబ్, ఎమరాల్డ్ ఏఐ సీఈఓ వరుణ్ శివరామ్, ప్రపంచ మేధోసంపత్తి సంస్థ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, జర్మనీ డిజిటల్ మంత్రిత్వ శాఖ మం త్రి కార్ స్టెన్ వైల్డ్ బెర్గర్, నోకియా సీఈఓ జస్టిన్ హోటార్డ్, హిటాచి సీఈఓ తోషియాకి టోకునాగా పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు: అవకాశాలపై యూనిలీవర్ పరిశీలన
ప్రపంచ వ్యాప్తంగా వస్తు వినియోగరంగంలో అగ్రగామిగా ఉన్న యూనిలీవర్ సంస్థ, హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసే అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక -2026 సదస్సులో భాగంగా మంగళవారం దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం యూనిలీవర్ చీఫ్ సప్లు చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో సమావేశమైంది. తెలంగాణలో జీసీసీ ఏర్పాటు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు కేం ద్రంగా హైదరాబాద్ వేగంగా మారుతుందని వివరించారు.
దీనిపై స్పందించిన విల్లెమ్ ఉయిజెన్ హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇప్పటికే మెక్‌డొ నాల్డ్స్, హైనెకెన్, కాస్టకో వంటి ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ (త్వరగా వినియోగ వస్తువుల) సంస్థల జీసీసీలు విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
తెలంగాణకు యూని లీవర్ విలువైన భాగస్వామి అని, వేగవంతమైన అనుమతులు, లైసెన్సింగ్ ప్రక్రియలతో తెలంగాణ వ్యాపారాలకు అనుకూల రాష్ర్టం గా నిలుస్తోంది అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని పారిశ్రామిక పార్కుల్లో వినియోగ వస్తువుల తయారీ రంగంలో పెట్టు బడుల అవకాశాలను పరిశీలించాలని యూనిలీవర్‌ను మంత్రి పొంగులేటి ఆహ్వానించారు.
ఏఐ రంగంలో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యమయ్యేందుకు ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి వ్యక్తం చూపింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక- 2026 వార్షిక సమావేశాల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నేతత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం ఫిలిప్స్ గ్లోబల్ నాయకత్వంతో భేటీ అయ్యారు.
రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్- స్కీజ్ గ్రాండ్ మాట్లాడుతూ.. ఏఐ రంగంలో తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సేవలపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘ తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026- 2030’ గురించి ప్రతినిధి బృందం వివరించింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఔషధ తయారీ, పరిశోధనాభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగాల్లో ప్రపంచ స్థాయి, స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్‌ను తెలంగాణలో నిర్మిస్తున్నామని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ , రీజినల్ రింగ్ రోడ్ మధ్యనున్న ప్రాంతంలో పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్ ) తయారీ, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్‌తో భేటీ
‘తెలంగాణ రైజింగ్’లో పెట్టుబడుల అన్వేషణలో భాగంగా ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ ఆలోన్‌క్ష స్టోపెల్‌తో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సం బంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్‌లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ ఇన్నోవేషన్‌తో పాటు హెల్త్‌టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతివ్వడంతో పా టు భాగస్వామ్యం పంచుకుంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రా యిల్ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. అంతకుందు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు 2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రతినిధి బృందానికి జ్యూరిక్ విమానాశ్రయం లో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్ , ఇతర అధికారులు ఆత్మీయ స్వాగతం పలికి, మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులున్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో.. భాగస్వామ్యానికి ముందుకొచ్చిన సౌదీ సంస్థ
సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘ఎక్స్ పర్టైజ్’ స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామయ్యేందుకు ఆసక్తి చూపింది. సంస్థ ప్రెసిడెంట్ , సీఈఓ మొహమ్మద్ ఆసిఫ్, దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థకు ఉద్యోగ అవకాశాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ శిక్షణ అందించడమే స్కిల్ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 2047 విజన్‌కు అనుగుణంగా తెలంగాణను భవిష్యత్‌కు సిద్ధమైన ప్రతిభా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఎక్స్‌పర్టైజ్ సంస్థ సీఈఓ మొహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా సుమారు 5వేల మంది నైపుణ్య కలిగిన సిబ్బందిని నియమించుకునే అవసరం తమకు ఉందని, ఆ అవసరాలను తీర్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యం చేసుకోవాలని ప్రతిపాదించారు. అవసరమైన అన్ని విభాగాల్లో శిక్షణను యూనివర్సిటీ తో కలిసి ప్రారంభించాలనుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో 2 వేలకు పైగా లైఫ్‌సైన్సెస్ సంస్థలు :రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
కొత్త లైఫ్ సైన్సెస్ విధానం, ఔషధ తయారీ వ్యూహాలు కలిసి తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పునాది వేస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 2 వేలకు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు, బలమైన ఐటీ-లైఫ్ సైన్సెస్-హెల్త్ కేర్ టాలెంట్ బేస్, జీనోమ్ వ్యాలీ, 300 ఎకరాలకుపైగా విస్తరించిన మెడికల్ డివైసెస్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఉన్నాయని మంత్రి వివరించారు.
హైదరాబాద్ వైద్య పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఇక్కడి ఆస్పత్రులు ఇప్పటికే క్రిటికల్ కేర్, అంబులెన్స్ సేవలు వంటి రంగాల్లో ఏఐను సమర్థవంతంగా వినియోగిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడానికి ఇది ఉత్తమ అవకాశమన్నారు. తెలంగాణకు వచ్చి.. జీనోమ్ వ్యాలీని సందర్శించాలని ఫిలిప్స్ నాయకత్వాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు.
తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఇప్పటికే మెడ్ ట్రానిక్, ఒలంపస్, జీఈ వంటి అగ్రశ్రేణి సంస్థల ఎంబెడెడ్ ఇంజినీరింగ్, ఆర్ అండ్ డీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ జాన్ విల్లెమ్- స్కీజ్ గ్రాండ్ మాట్లాడుతూ.. ఆరోగ్య రంగంలో తెలంగాణ చేపడుతున్న ఏఐ ఆధారిత మార్పు ప్రశంసనీయమని కొనియాడారు.
మేమూ భాగస్వాములమవుతాం: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లలో భాగస్వామ్యం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా (ఏపీఏసీ) ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో సమావేశమయ్యారు.
ప్రధానంగా వాతావరణంలో పెను మార్పులు, వ్యవసాయంపై దాని ప్రభావం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యల పరిష్కారాలపై సమగ్రంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివద్ధి నమూనాను వివరించారు.
తొలి గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్‌ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసినందుకు గూగుల్ బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి కతజ్ఞతలు తెలిపారు. గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లు, వాతావరణ మార్పు అంశాల్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు గూగుల్ సిద్ధంగా ఉందని తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివద్ధిని వివరించారు.