వ్యవసాయానికి ప్రారంభం ఉగాది
డాక్టర్ నందిని సిధారెడ్డి
ముషీరాబాద్, మార్చి 14(విజయక్రాంతి): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు భాషా చైతన్య సమితి , జాతీయ తెలుగు సారస్వత పరిషత్ నక్క వెంకటమ్మ యాదవ్, నక్క యాదగిరి, స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ స్పోరట్స్ ఫౌండేషన్, లక్ష సాధన ఫౌండేషన్, మహిళాభారతి, గోల్కొండ సాహితీ కళా సమితి, కుసుమ ధర్మన్న కళాపీఠం, పాలడుగు నాగయ్య కళాపిఠం, దర్పణం సాహిత్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో తెలుగు భాష చైతన్య సమితి అధ్యక్షుడు బడే సాబ్ నిర్వహణలో ’పరాభవ నామ సంవత్సర ఉగాది శతాధిక కవి సమ్మేళనం, అష్టావధాన ముగింపు కార్యక్రమం జరిగింది.
ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ సిధారెడ్డి, విశిష్ట అతిథులుగా తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సిధారెడ్డి మాట్లాడుతూ... ఉగాది అనేది వ్యవసాయానికి తొలిరోజని, భారత దేశంలో పంచాంగం చంద్రమానం, సౌరమానం అని రెండు రకాలుగా జరుపుకుంటారని, దక్షిణ భారతదే శంలో చంద్రమానాన్ని పాటిస్తామని తెలియజేశారు.
ఉగాది అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉందని, ఉగాది వరకు ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అనంతరం శతాధిక కవులతో కవి సమ్మేళనం జరిగింది. అలాగే అవధాని మలుగ అంజయ్యచే అష్టావధానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమనికి సభా సమన్వయకర్తగా డా. బి. జయ రాములు వ్యవహరించారు. ఉదయం జరిగిన ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, విశిష్ట అతిథిగా నక్క శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... తెలుగు ప్రజలకు మొదటి పండుగ ఉగాది పండుగనేనని తెలియజేశారు. పరాభవ నామ సంవత్సరం అంటే దేశంలో ఉన్న అన్యాయం, అధర్మం పరాభవం చెంది శాంతి నెలకొనడం అని అన్నారు. ఈ సభకు రామకృష్ణ చంద్రమౌళి సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నూతన పంచాంగ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుసుమ ధర్మన్న కళా పీఠం చైర్ పర్సన్ రాధా కుసుమ, పాలడుగు సరోజినీ దేవి, కేసినేని రాంప్రసాద్, ఉపేంద్ర స్వామి, గజవల్లి సత్యనారాయణ, బైలూరి యోగేష్ ప్రభు, ప్రజ్ఞా రాజు, ప్రొఫెసర్ రాజారత్నం, పెబ్బేటి మల్లికార్జున్, గంటా మనోహర్ రెడ్డి, చంద్ర ప్రకాష్ రెడ్డి, తిక్కయ్య తదితరులు పాల్గొన్నారు.




