అప్రకటిత విద్యుత్ కోతలు
- అల్లాడుతున్న ప్రజలు
- ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి
- స్పందించని విద్యుత్ అధికారులు
వాంకిడి, జూన్ 3(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంతో పాటు విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బం దులకు గురిచేస్తున్నాయి. రోజూ గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్ప డుతుండటంతో ప్రజలు ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండలు, పెరు గుతున్న ఉష్ణోగ్రతల మధ్య విద్యుత్ కోతలు మరింత ఇబ్బందికరంగా మారాయని ప్రజ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉక్కబోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలపై ఆధారపడుతున్నప్పటికీ, తరచూ విద్యుత్ నిలిచిపోవడంతో రాత్రివేళలు నిద్రలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది.విద్యుత్ ఆధారిత వ్యాపారాలు నిర్వహించే వ్యాపారులు కూడా భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. వెల్డింగ్ షాపులు, ఫోటో స్టూడియోలు, ఐస్క్రీం పార్లర్లు, కంప్యూటర్ సెంటర్లు వంటి వ్యాపారాలు విద్యుత్ కోతల కారణంగా సక్రమంగా సాగ డం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గంటల తరబడి పవర్ లేకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయని, ఆదాయం తగ్గిపోతోందని చెబుతున్నారు.విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రతిసారీ సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా స్పందన ఉండటం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సమస్య ఏమిటి..? ఎప్పుడు విద్యుత్ వస్తుంది..? అనే కనీస సమాచారం కూడా అందించడం లేదని వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా అధికారులు ఫోన్లు ఎత్తకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రతినెలా విద్యుత్ బిల్లులు మాత్రం సమయానికి వసూలు చేస్తున్న అధికారులు, నాణ్యమైన విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యుత్ వినియోగదారులు మండిపడుతున్నారు. ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






