20-11-2025 01:30:41 PM
హైదరాబాద్: అర్బన్ నక్సలైట్లు(Urban Naxalites) చిన్నపిల్లలను రెచ్చగొడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) అన్నారు. చిన్నపిల్లలను తొపాకులు పట్టుకుని అడవులకు వెళ్లమని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. అర్బన్ నక్సలైట్లు పట్టణాల్లో ఏసీ గదుల్లో కూర్చొని ఉంటారు. కార్లలో తిరుగుతూ సొంత పైరవీలు చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. అర్బన్ నక్సలైట్లు మిగితా వారిని లొంగిపోవాలని చెప్పకుండా తమ మాటలతో యువతను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని అడవుల్లో ఉన్నవారు కూడా గ్రహించారని కొనియాడారు.
గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా.. సీఎం ఏం చేస్తారో చూడాలి: బండి సంజయ్
కేటీఆర్ ప్రాసిక్యూషన్(KTR Prosecution) కు గవర్నర్ అనుమతిపై ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెబుతోందో చూడాలని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇప్పుడు ఏం మాట్లాడుతారు? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు గవర్నర్ అనుమతి ఇవ్వొద్దనే సీఎం రేవంత్ రెడ్డి కోరుకున్నారు.. గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా.. ఇప్పుడు సీఎం ఏం చేస్తారో చూడాలన్నారు. అవినీతిపరుల ఆస్తుల జప్తు చేస్తానని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని బండి సంజయ్ గుర్తుచేశారు. రద్దు చేయబడిన ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌తో ముడిపడి ఉన్న ఆర్థిక అవకతవకలపై బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై విచారణకు తెలంగాణ గవర్నర్ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే.