25-07-2025 01:06:05 PM
న్యూఢిల్లీ: ఇతర పార్టీలకు సుద్దులు చెప్పే ముందు తాము ముందు పాటించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) హయాంలో బీసీ-ఇ పేరుతో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) గుర్తుచేశారు. బీసీ-ఈ రిజర్వేషన్ చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిందని కిషన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. 4శాతాన్ని 10 శాతానికి పెంచుతున్నారు. బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తోందని ఆరోపించారు. బీసీల రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని వెల్లడించారు. 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీలో 34 శాతం బీసీ రిజర్వేషన్లు గతంలో అమలు చేశారని చెప్పారు.
42 శాతం వల్ల బీసీ రిజర్వేషన్లు పెరిగిందా.. తగ్గిందా చెప్పాలని ఆయన కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేశారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం జరగదని కిషన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. బీసీ రిజర్వేషన్ వల్ల ఎంఐఎం పార్టీకే లబ్ధి చేకూరుతోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ జనగనణపై ఏనాడైనా కాంగ్రెస్ ఆలోచించిందా? బీసీ జనగనణ చేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వం(Prime Minister Modi's government) నిర్ణయించిందని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా జనాభా సేకరణ, కుల గణన చేస్తామని వెల్లడించారు. బీసీని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందా.. బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మోదీ కులాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీ జాబితాలో చేర్చిందని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. ప్రజలు తిరస్కరిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.