26-07-2025 01:21:28 AM
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీని కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి అవమానిస్తారా అని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలకు బీసీ--ఈ పేరుతో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, మతపర రిజర్వేషన్లు రాజ్యంగవిరుద్ధమని, ఇలాంటి రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు రెండుసార్లు తీర్పునిచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ స్టే తెచ్చుకుని అమలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ముస్లింలకు 4 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచి.. బీసీలకు అన్యా యం జరిగేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
కులగణన పేరు తో బీసీ జనాభాను భారీగా తగ్గించే ప్రయ త్నం చేసిందని, 56 శాతం బీసీలని చెబు తూ.. వారిలో ముస్లింలను 10 శాతంగా చూ పించి నిజమైన బీసీలు 46 శాతం మాత్రమే ఉన్నారంటూ బీసీలను మోసం చేసే ప్రయ త్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు ఎవరికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటోందో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో చేతివృత్తులపై ఆధారపడి పనిచేసే కులాలకు మాత్రమే రిజర్వేషన్లు అందించారని తెలిపారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కూడా ముస్లిం వర్గాలు లబ్ధి పొందే అవకాశం ఉండగా, మళ్లీ బీసీ రిజర్వేషన్లతో కలిపి ముస్లింలకు రాజ్యంగ విరుద్ధం గా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు ప్రయత్నాలు చేయటం ఏ విధంగా కరెక్టని ప్రశ్నించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీలకు మోసం
గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట కుట్రపన్నారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 150 మున్సిపల్ డివిజన్లు ఉంటే.. 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేశారని, ఆ 50 బీసీ సీట్లలో బీసీయేతరులైన మజ్లిస్ పార్టీకి చెందిన వారే గెలిచారని తెలిపారు. ఇప్పుడు 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట మళ్లీ ముస్లింలకే లబ్ధి చేకూర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నప్పటికీ, అందులో 10 శాతం ముస్లింల కు పోతే... గతంలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 32 శాతానికి తగ్గించే కుట్ర కనిపిస్తోందన్నారు. అసదుద్దీన్ ఒవైసీ పార్టీకి లబ్ధి చేకూర్చడమే తప్ప బీసీలకు ఒనగూరే ప్రయోజనమే లేదన్నారు. కోట్లకు పడగలెత్తిన ఒవైసీ లాంటి వ్యక్తులతో బీసీ పేద కులా ల నాయకులు ఎన్నికల్లో పోటీపడి గెలిచే అవకాశం ఉందా అని ప్రశ్నించారు.
బీసీలకు అన్యాయం చేసేలా తూతూమంత్రపు సర్వే లు చేయబోమని, తాము చేసే కులగణన రాజ్యంగబద్దం చేసి, భవిష్యత్తులో బీసీలకు న్యాయం చేస్తామన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ వ్యక్తిని కూడా పీఎం, సీఎంను చేయలేదని విమర్శించారు.
కన్వర్టెడ్ బీసీ అంటూ మోదీని అవమానిస్తారా?
కన్వర్టెడ్ బీసీ అంటూ ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి హేళన చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 1972లో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారని, వారంతా కన్వర్టెడ్ ఎస్టీలా అని ప్రశ్నించారు. 1994లో గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారమే మోదీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చినప్పుడు మోదీ కనీసం ఎమ్మెల్యేగా కూడా లేరని గుర్తు చేశారు.
కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కులాన్ని జాతీయ స్థాయిలో ఓబీసీ జాబితాలో చేర్చిన విషయం తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అదే సమయంలో విశ్వ బ్రాహ్మణులతో పాటు మరికొన్ని కులాలను కూడా బీసీల్లో చేర్చారని, విశ్వ బ్రాహ్మణులను కూడా కన్వర్టెడ్ బీసీలని అంటారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా చాలా కులాలను ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చారని, మరి వారందరినీ కూడా కన్వర్టెడ్ కులాలకు చెందిన వారని చెబుతారా అని కిషన్ రెడ్డి నిలదీశారు.
మోదీని, ఆయన కులాన్ని కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా మైలేజీ పొందేందుకు ఎన్నోసార్లు కించపరుస్తూ మాట్లాడుతున్నారని ఇది దుర్మార్గమన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వరుసగా కాంగ్రె స్ అధికారం కోల్పోతోందని, వరుసగా మూడోసారి కూడా రాహుల్ గాంధీని దేశ ప్రజలు తిరస్కరించి, మోదీని ప్రధానిని చేశారని..
ఈ ఫ్రస్టేషన్‌తోనే రేవంత్‌రెడ్డితో రాహుల్‌గాంధీ ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. రాహుల్‌గాంధీ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి.. బీసీని ముఖ్యమంత్రిని చేయాలని హితవు పలికారు.
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఘోర ఓటమి
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఓడిపోవడం ఖాయమని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. వంద మంది రాహుల్ గాంధీలు కాదు.. వెయ్యి మంది రేవంత్‌రెడ్డిలు వచ్చినా ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు.
తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం పెంచిన రిజర్వేషన్లతోనే స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ లాంటి ముస్లింలకు కాకుండా పూర్తిగా బీసీలకే అందేలా, వారికే న్యాయం జరిగేలా రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.