ప్రగతి పథంలో భారత్
కార్గిల్ విజయ్ దివస్‌లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్
శ్రీనగర్, జూలై 26: భారత్ నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి వైపు దూసుకువె ళుతుండగా, పాకిస్థాన్ చొరబాట్లు, ఉగ్రవాదులు, హవాలా ద్వారా భారత్‌కు అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తుందని, తమ సైన్యం అడ్డంకులను తిప్పికొట్టేందుకు సిద్ధం గా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఆదివారం జూలై 26 కార్గిల్ 27వ విజయ్ దివస్ సందర్భంగా లడఖ్ ద్రాస్ సెక్టార్‌లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రసంగిస్తూ పాక్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.
భారత్ నౌకలు, స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, అంతరిక్షం, సెమీకండక్టర్లు లాంటి విషయాల్లో అన్వేషణలు కొనసాగిస్తూ ముందుకు వెళుతుందన్నారు. మరోవైపు పాకిస్థాన్ దుష్టపన్నాగాలతో భారత్ అభివృద్ధి మార్గానికి ఆటంకాలు సృష్టించాలని భావిస్తుందన్నారు. పాక్ దుష్టపన్నాగాలను భారత సాయుధ దళాలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పాక్‌తో పీవోకే విషయంలో తప్ప మిగతా విషయాల్లో ఎ లాంటి చర్చలు జరపబోమని పునరుద్ఘాటించారు.
ఈ యుద్ధ స్మారక చిహ్నంలో కులాలు, మతాల కతీతంగా అమరవీరులున్నారని చెప్పారు. దేశాన్ని విభజించాలని కలలు కనేవారు సైనిక పరాక్రమం, శౌర్యం, ధైర్యం ఏ రకమైనదో చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. సమాజపు పరిమితులను అధిగమించి కార్గిల్ లాంటి విజయాన్ని సాధించామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 1999 మే 5న పాక్ కార్గిల్‌లోకి చొరబడగా, 84 రోజులపాటు కొనసాగిన భీకర పోరుతో జూలై 6న భారత్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. పాక్ జవాన్లను తరిమికొట్టింది. ఈ యుద్ధం లో భారత్‌కు చెందిన 527మంది సైనికులు అమరులుకాగా, 1,363మందికి గాయాలయ్యాయి. అప్పటినుంచి ప్రతీయేటా జూలై 26న కార్గిల్ విజయోత్సవ దివస్‌ను నిర్వహించుకుంటారు.






