02-12-2025 07:59:18 PM
గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి నగలు ఎత్తుకెళ్లారు
సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు, క్లూస్ టీం తో పరిశీలించిన పోలీసులు
లబోదిబోమన్న బాధిత కుటుంబం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లిన ఓ కుటుంబం తిరిగి ఇంటికి వచ్చి చూసుకునేసరికి గుర్తుతెలియని దుండగులు చొరబడి ఇల్లును గుల్ల చేసి భారీ చోరీకి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల, బాధిత కుటుంబం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సైలాన్ బాబా కాలనీలో ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సైలాన్ బాబా కాలనీలో నివాసం ఉంటున్న మహమ్మద్ వహీద్ తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి సిద్దిపేటకు వెళ్ళాడు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటి నుంచి కామారెడ్డిలోని సైలన్ బాబా కాలనీ లోని ఇంటికి తిరిగి వచ్చాడు.
ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో పాటు ఇంట్లో బీరువాలో ఉన్న ఏడు తులాల బంగారు నగలు, 80 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన బాధితుడు వహీద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. పట్టణ సీఐ నరహరి సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. కాలనీలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ నరహరి తెలిపారు.
ఎవరైనా ఇంటికి తాళాలు వేసి ఇంట్లో నగలు డబ్బులు దాచుకొని వెళ్లకూడదని బ్యాంకుల్లో లాకర్లలో పెట్టుకొని వెళ్లాలని పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. విలువైన బంగారు నగలు, డబ్బులు చొరికి గురైన తర్వాత బాధపడే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్తే పెట్రోలింగ్ పార్టీ బందోబస్తు నిర్వహిస్తుందని సీఐ నరహరి తెలిపారు. పట్టణ ప్రజలు ఇండ్లలో తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.