7 May, 2026 | 10:27 AM

విడువని వాన

01-09-2024 04:00 AM

నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం

జలమయమైన రోడ్లు, కాలనీలు

ట్రాఫిక్ జాం, విద్యుత్ సరఫరాకు అంతరాయం

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి) : నగరంలో ఎడతెరిపి లేకుం డా వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, సికింద్రాబాద్, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, తిరుమలగిరి, అల్వాల్, కవాడిగూడ, గాంధీనగర్, బేగంపేట్, మారేడ్‌పల్లి, బంజారాహిల్స్, మల్కాజిగిరి, కీసర, చర్లపల్లి, కుషాయిగూడ, కూకట్‌పల్లి, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

నగరంలో కుండపోతగా కురిసిన వర్షానికి హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్‌సాగర్ ఫుల్‌ట్యాంక్ లెవల్ 513.41 మీటర్లు కాగా, శనివారం రాత్రి 8.30 గంటల వరకు 513.43కు చేరింది. కాగా మాగ్జిమమ్ వాటర్ లెవల్ (ఎండబ్ల్యూఎల్) 514.75.  శనివారం రాత్రి 9 గంటల వరకు నగరంలో అత్యధికంగా అల్వాల్‌లో 2.08 సెంటీమీటర్లు, మల్కాజిగిరిలో 2.0 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్‌లో 1.9 సెంటీమీటర్లు, హయత్‌నగర్‌లో 1.9 సెంటీమీటర్లు, గోల్కొండలో 1.8, ముషీరాబాద్ 1.85 సెంటీమీటర్లుగా నమోదవ్వగా.. అత్యల్పంగా సంతోష్‌నగర్‌లో 0.8 సెంటీమీటర్లుగా నమోదైంది.

కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా కురిసిన వర్షంతో రోడ్లపై మోకాలి లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉప్పల్, తార్నాక, నాగోల్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, బంజారాహిల్స్, కొండాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ (డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్) బలగాలు రోడ్లపైకి చేరుకుని లోతట్టు ప్రాంతాల్లో  నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు.

అప్రమత్తంగా ఉండాలి..

నగరంలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తం గా ఉండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మిఆదేశించారు. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్‌రెడ్డి, కమిషనర్ ఆమ్రపాలి కాట, జోనల్ కమిషనర్లతో.. మేయర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలాల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచిం చారు. ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వర్షానికి సంబంధించి ఏమైనా అత్యవసర సహాయం అవసరమైతే జీహెచ్‌ఎంసీ 040 9000113667, కలెక్టరేట్ కంట్రోల్ నంబరు 040 9063423979 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

ఫిర్యాదు అందిన వెంటనే స్పందించాలి

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎం డీఏ, వాటర్ వర్క్స్, డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, విద్యుత్ ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. పాత భవనాల్లో నివాసముంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించడంతో పాటు భారీ వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బంది అందుబాటులో ఉండి నీరు వెంటనే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. సమస్య తీవ్రమైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి తెలిపారు. వర్షాలు కురిసినపుడు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

రేపు పాఠశాలలకు సెలవు

నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పిల్లల భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్తగా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ శనివారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఖచ్చితంగా అన్ని పాఠశాలలు సోమవారం మూసివేయాలని కలెక్టర్ తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. 

వికారాబాద్‌లో పొంగిన వాగులు, వంకలు

వికారాబాద్, అగస్టు 31 (విజయ క్రాంతి): జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం ఏకధాటిగా ఉదయం వరకు  కురిసింది. జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్ నుంచి పరిగి వెళ్లేదారిలో మద్గుల్ చిట్టెంపల్లి, నస్కల్ వాగులు  ఉధృత్తంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీస్ అధికారులు వాగుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

జంట జలాశయాలకు భారీగా వరద

  1. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  2. జలమండలి ఈడీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ (జంట) జలాశయాలకు వరద చేరుతోంది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి అధికారులు అప్రమత్త మయ్యారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఈడీ అశోక్‌రెడ్డి సూచించారు.

కాగా గండిపేట జలాశయానికి పరివాహక ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, శంకరపల్లి, ముమాన్‌పల్లి, దోబీ పల్లి నుంచి మూసీ నది ద్వారా ఉస్మాన్‌సాగర్‌కు నీరు చేరుతుంది. అలాగే హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌కు చేవెళ్ల, అందాపూర్, కొత్వాల్ పేట్, నర్కూ డ, తాండూర్, మొయినాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఈసీ వాగు ద్వారా ఈ జలాశయానికి వరద చేరుతుంది.

అప్రమత్తంగా ఉండాలి..

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్సాన్స్ టీమ్(ఈఆర్టీ)లు, ఎస్పీటీ వాహనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీవరేజీ ఓవర్‌ఫ్లో అయ్యే మ్యాన్‌హోళ్లను గుర్తించి చర్యలు చేపట్టాలని, నీళ్లు నిలిచే ప్రాంతాలపై దృష్టి సారించాలని చెప్పారు. కలుషిత నీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.