రేషన్ బియ్యానికి రెక్కలొచ్చినట్టే!
మూడు నెలల బియ్యాన్ని ఒకేమారు పంపిణీతో అక్రమార్కుల ఇష్టారాజ్యం
పంపిణీ మొదలైన మూడో రోజే 85 కింటాళ్ళ సన్న బియ్యం పట్టివేత
టేకులపల్లి, ఏప్రిల్ 5,(విజయక్రాంతి): రేషన్ బియ్యానికి రెక్కలొస్తున్నాయి. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల బియ్యం ఒకే మారు పంపిణీ చేస్తుండటంతో అక్రమార్కులది ఇష్టారాజ్యమైంది. ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ నెలంతా పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చౌక దుకాణాలకు సరిపడా సన్న బియ్యం చేరుకుంది. ఒకవైపు బియ్యాన్ని లబ్దిదారులకు పంపిణీ చేస్తుండగానే దళారులు అక్రమంగా కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ తంతులోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు 85 క్వింటాళ్ల రేషన్ బియ్యం సివిల్ సప్లై అధికారులు శనివారం దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిలువ చేసిన చింతల గౌతం అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని సివిల్ సప్లై హెచ్చరించారు. ఈ హెచ్చరికలు తూతూ మంత్రమనే చెప్పొచ్చు. ప్రభుత్వం ఏడాది నుంచి దొడ్డు బియ్యంపై బదులు సన్న బియ్యం ఒక్కో లబ్ధిదారునికి ఆరేసి కిలోలు ఉచితంగా పంపిణీ చేస్తుంది.
ఇలా మూడు నెలలవి కలిపి ఒక్కో లబ్ధిదారునికి 18 కిలోల బియ్యం వస్తున్నాయి. మంచి బియ్యం వచ్చిన, రాకున్నా ఆలా ఇలా అమ్మేసుకుంటున్నారు. ఒక్కో కిలో పది నుంచి, 12 రూపాయలకు అమ్ముకుంటున్నారు. రేషన్ బియ్యం వ్యాపారాలు రేషన్ దుకాణం ఉన్న ఏరియాలోని అద్దెకు గది తీసుకొని రెండొందల కింటాళ్ళ వరకు నిల్వచేసి ఏకంగా లారీలలో రవాణా చేస్తున్నారు. అవి నేరుగా మిల్లుల్లోకి వెళ్తున్నట్లు సమాచారం.
తూతూ మంత్రపు దాడులు చేసి సివిల్ సప్లై అధికారులు చేతులు దులుపుకోవడంతో రేషన్ అక్రమ బియ్యం వ్యాపారుల దందా మూడు పువ్వులు ఆరు కాయల్లా మారింది. రేషన్ దుకాణాల వద్దనే సేకరించేందుకు మరికొంత మంది మధ్యవర్తులను నియమించుకొని వాటాలు పంచుకుంటున్నారు. రేషన్ బియ్యం అక్రమంలో రేషన్ డీలర్ల పాత్ర కూడా ఉండనే చెప్పొచ్చు. రేషన్ ఉచిత బియ్యాన్ని అమ్ముకునే లబ్ధిదారుల పై నిఘా పెట్టి వారి కార్డులను రద్దు చేస్తే కొంత మేర ఈ అక్రమం తగ్గే అవకాశం లేకపోలేదు. ఇకనైనా రెవిన్యూ అధికారులు రేషన్ దుకాణాలపై ద్రుష్టి సారిస్తే మంచిది.




