18-01-2026 12:00:00 AM
మేకిరి దామోదర్ :
భారతదేశంలో ఒకప్పుడు గ్రామీ ణ జీవనమే దేశపు ఆత్మగా నిలిచింది. అయితే నేడు దేశ ఆర్థికాభివృద్ధికి పట్టణాలు, నగరాలు, మహానగరాలు ప్రధాన ఇంధనంగా మారాయి. ఉద్యోగం, విద్య, వైద్యం, వ్యాపారాలన్నీ పట్టణాల చుట్టే తిరుగుతున్నాయి. అందుకే గ్రామీణం నుంచి ప్రజల వలసలు పట్టణాల వైపుకు సాగుతున్నాయి. 2020 నాటికి దేశ జనాభాలో సు మారు 48 కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తే, 2050 నాటికి ఇది 95 కోట్లకు చేరుతుందని అంచనాలున్నాయి. వచ్చే రెండు మూడు దశాబ్దాల్లో దేశ జనాభాలో సగానికి మించిన వారు పట్టణాలు, నగరాల్లోనే జీవించబోతున్నారు. ఈ వాస్తవాన్ని పట్టించుకోకుండా సాగుతున్న పురపాలక పాలన, ప్రజల భవిష్యత్తుతో ఆడుకునే ప్రమాదకర ఆటగా మారుతోంది.
ఇలాంటి కీలక సమయంలో తెలంగాణ రాష్ర్టంతో పాటు దేశవ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కేవలం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రతిష్టకోసం లేదా రాజకీయ పార్టీల సీట్ల లెక్కలకోసం జరిగేవి కావు. ఇవి రాబోయే తరాల జనజీవనానికి పట్టణాలు, నగరాల ప్రాణవాయువు ఎవరి చేతు ల్లో ఉండబోతోందో నిర్ణయించే ప్రజాస్వా మ్య ప్రతిష్టాత్మక ప్రక్రియ. నేడు మన పట్టణాలు, నగరాలు రెండు వైపులా నలిగిపో తున్నాయి. ఒకవైపు విపరీతంగా పెరుగుతున్న జనాభా, మరోవైపు వాతావరణ మార్పులతో ఉధృతమవుతున్న ప్రకృతి వైపరీత్యాలు.
ఇవన్నీ కలిసి అభివృద్ధి పేరు తో పట్టణాలను కాలుష్య కాసారాలుగా, కాంక్రీట్ జంగళ్లుగా మార్చేస్తున్నాయి. ప్రకృతితో సమ్మిళిత జీవనానికి విరుద్ధంగా మన పట్టణాలు మారుతున్నాయా అన్న సందే హం కలుగుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధంలాంటి ఒత్తిడిని సృష్టిస్తోంది. నిపుణుల మాటల్లో.. ఇది శీఘ్రగతిన ప్రగతి పేరుతో మనం చేసిన ప్రకృతి, సహజ వనరుల దోపిడీ, విధ్వంస ఫలితమే. అందుకే మానవ మనుగడే పురపాలకుల ప్రధాన ఎజెండాగా మారాల్సిన అవసరముంది.
వాతావరణ మార్పులు..
ప్రపంచ బ్యాంకు 2022-- మధ్య నిర్వహించిన ఒక నివేదిక ఊహించని నిజాన్ని బయటపెట్టింది. భారత్‌లోని పట్టణాలు, నగరాలు, మహానగరాలు వరదలు, వడగాలులు, తీవ్రమైన ఎండల వంటి వాతావరణ విపత్తులకు ఎక్కువగా గురవుతున్నాయి. 2030లో ఈ ముప్పు మరింత తీవ్రమవుతుందని నివేదిక హెచ్చరిస్తోంది. అధిక వర్షాలతో నదులు, వాగులు, డ్రైనేజీ వ్యవస్థలు భారం తట్టుకోలేక పట్టణాలను ముం చేస్తున్నాయి. నగరాల్లో ఉష్ణోగ్రతలు చుట్టుపక్కల గ్రామాల కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనినే “హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు.
కాంక్రీట్ జంగల్‌గా మారిన నగరాలు వర్షపు నీటిని భూమిలోకి జీర్ణించుకోనివ్వడం లేదు. ప్రతి చుక్కనీరు రోడ్లపైనే మురుగిపోతున్నది. చెట్లు తగ్గిపోవడంతో వేడి పెరిగి ఫలితంగా ఆకస్మిక -వరదలు, తీవ్ర ఎండలు, ఆరోగ్య సమస్యలు, నీటి కొరత లాంటివి ఏర్పడుతున్నాయి. ఇవన్నీ ప్రకృతి తప్పిదాలు కావు.. మనం చేసిన ప్రణాళికలేని పట్టణీకరణ ఫలితాలు. గతంలో వరదలు రాని ప్రాంతాలు నేడు నీటమునిగి పోతున్నాయి. పనివేళలు కోల్పోయే కార్మికుల సంఖ్య గత 30 ఏళ్లలో 71శాతం పెరిగింది. ఈ నష్టానికి మూల్యం చెల్లిస్తున్నది సామాన్య ప్రజలే.
ఎజెండా అవసరం..
ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే కేవ లం రోడ్లు వేయడం, భవనాలు కట్టడం సరిపోదు. పట్టణాలను, నగరాలను ‘వాతావ రణాన్ని తట్టుకునేలా’ నిర్మించాలి. ఇందుకు భారీ పెట్టుబడులు అవసరం. అంచనాల ప్రకారం 2050 నాటికి గ్రీన్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 2.4 ట్రిలియన్ డాలర్లు అవసరం. నగరపాలక సంస్థలు కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడితే ఈ లక్ష్యాన్ని చేరలేవు. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, వాతావరణ నిధు లు, గ్రీన్ బాండ్లు వినియోగించాలి.
అయితే ఇందుకు పారదర్శకత, స్పష్టమైన ప్రణాళిక, అమలు సామర్థ్యం అవసరం. అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు, బ్రెజిల్ నగరాల్లో వరద నియంత్రణ పథకాలు, సింగపూర్ పట్టణ ప్రణాళికలు -ఇవన్నీ మనకు విలువైన పాఠాలు నేర్పుతున్నాయి. నగరాలు ప్రకృతితో యుద్ధం చేయకూడదు. ప్రకృతితో కలిసి జీవించాలి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గ్రామాల నుంచి నగరాలకు వలసలు ఆగ డం లేదు. ఈ జనసాంద్రతకు తగిన విధం గా నీరు, రవాణా, నివాసం, పచ్చదనం, కాలుష్య నియంత్రణ-ఇవన్నీ సమన్వ యంతో ఉండాలి.
కానీ ఎన్నికల చర్చలు ఏమి చెబుతున్నాయి? రోడ్లు, లైట్లు, డ్రైనేజీ-మినహా వాతా వరణ మార్పులపై, విపత్తుల నిర్వహణపై మౌనమే శరణ్యమవుతుంది. పురపాలక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు భవిష్యత్ తరాల మనుగడకు ఉపయోగపడే ఎజెండాలతో ప్రజల ముందుకు రావాలి. అలాంటి వారినే ప్రజలు పాలకులుగా ఎన్నుకోవాలి.
అప్పుడే అభివృద్ధి!
పురపాలక ఎన్నికలు అంటే కేవలం రోడ్డు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా సరిగా ఉన్నాయా లేదా అనేది మాత్రమే చూడకూడదు. ఈ ఎన్నికలు పట్టణాలు, నగరాలు, మహానగరాల అభివృద్ధికి, భవిష్య త్తుకు సంబంధించినవి. ఇవి సాధారణ రాజకీయ క్రీడ ఎంతమాత్రం కాదు. రేపటి నగరాలకు జీవనాధారాలు ఎవరి చేతుల్లో ఉంటాయో నిర్ణయించే ప్రజాభిప్రాయ ప్రక్రియ. నగరాలు మనకు ఉపాధి ఇస్తాయి. కానీ వాటిని కాపాడే పాలనలేకపోతే అవే మన రేపటి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తాయి. ‘మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నట్లుగా’ అవుతుంది. వరదలు ముంచెత్తుతాయి, ఎండలు మండి పోతాయి, కాలుష్యం ఊపిరాడనివ్వదు.
అందుకే ఓటరు ఈసారి పురపాలక ఎన్నికల్లో ఒక్క ప్రశ్నను కచ్చితంగా అడగాలి. ‘మీరు రోడ్లు వేస్తారా? లేక మా పిల్లల భవిష్యత్తును కాపాడతారా?’ అని ప్రశ్నించాలి. అయితే పాలకులు ఒక్క నిజం గుర్తుంచుకోవాలి. పురపాలక పదవి కుర్చీ కాదు. పట్టణ, నగర, మహానగర ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత. పట్టణాలను వాతావరణాన్ని తట్టుకునేలా అన్ని మౌలిక సదుపా యాలతో నిర్మించగలిగినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది. అలా కాకుంటే మనం కట్టే కాంక్రీట్ గోడ భవిష్యత్తుకే అడ్డుగోడగా మారుతుంది.
వ్యాసకర్త సెల్: 9573666650