18-01-2026 12:00:00 AM
రేపు యోగి వేమన జయంతి :
‘ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు’ ఈ పద్యం వినగానే గుర్తుకువచ్చేది యోగి వేమన. ఈయన ప్రజాకవిగా అభివర్ణింపబడ్డారు. తేలికైన పదాలతో అనుభవాలకు అక్షర రూపం కల్పించి, అలవోకగా ఆట వెలదులను రాసి, పండిత పామరులను మెప్పించిన గొప్ప కవివర్యులు. సామాజిక చైతన్యంతో సమాజ మార్పుకోసం ఆరాటపడిన అచ్చమైన తెలుగు కవి. యోగి వేమన లక్ష్మమ్మ, తుంగ కేశవుల దంపతులకు 1412 సంవత్సరంలో జన్మించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. రెడ్డి వంశంలో జన్మించిన వేమన రాజ్యభోగాలను ఆడంబరంగా త్యజించి తాను తెలుసుకున్న వేదాంత రహస్యాలను, జీవిత ధర్మాలను, ఉత్తమ మార్గ విధానాలను ప్రజలందరికీ తెలియజేయడానికి దేశమంతా సంచరించారు.
వానకు తడవని వారుండరు అన్నట్టు.. వేమన పద్యం నోటికి రానివారు ఉండరనేది లోకోక్తి. ‘ఆలుసుతులు మాయ, -అన్నదమ్ములు మాయ’.. ‘ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా’..‘ రాళ్లు రప్పలు తెచ్చి రమ్యమౌ గుడికట్టెదరు’.. ‘తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి’.. ‘అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను’.. అంటూ మూఢ విశ్వా సాలను రూపుమాపడానికి అక్షరాలను ఆయుధాలుగా సమాజం మార్పు కోసం పరితపించారు. వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైత న్యం వేమన పద్యాల లక్షణం. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశి ష్ట్యాన్ని వేమన తన పద్యాల్లో ప్రదర్శించాడు.
కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం లాంటి ప్రతీ సామాజిక సమస్యల మీద వేమన కలం ఝళిపించారు. పద్యాలన్నీ ఆటవెలది ఛందస్సులోనే చెప్పారు. విగ్రహాల్లో యోగి వేమన బట్టలు లేకుండా నగ్నంగా కనిపించడం వెనుక కారణముంది. తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు బట్టలుండవు, భూమిని విడిచి పోయేటప్పుడు కూడా ఏమీ లేకుండా పోతామన్న వైరాగ్య భావంతో బట్టలు కట్టుకోకుండా జీవితాంతం ఉండిపోయారు. ఇక వేమన సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు సీపీ బ్రౌన్. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన సీపీ బ్రౌన్ వేమన తిరిగిన ప్రాంతాలన్నీ చుట్టి మొత్తం 1,214 పద్యాలతో వేమన పద్య పుస్తకాన్ని ప్రచురించారు.
వేమన ఆశు కవి, ప్రజా కవి, దేశ దిమ్మరి. దేశం మొత్తం తిరిగిన వేమన తన అనుభవాలను పద్యాల రూపంలో అప్పటికప్పుడు ప్రజలకు చెప్పడంలో నేర్పరి. వేమన పద్యాలు తెలుగు నేలంతా విస్తరించి ఉన్నాయి. వేమన పద్యాలు అందరికీ అర్థమయ్యేలా సులువుగా ఉంటాయి. భారతదేశంలో కుల వ్యవస్థ అనేక శతాబ్దాలుగా ఉనికిలో ఉంది. దాని సామాజిక, రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ, పర్యావరణ చరిత్రను అనేక విధాలుగా రూపొందించింది. అంటరానితనం వంటి కొన్ని ఆచారాలు పూర్తిగా కాకపోయినా, చాలా వరకు నిర్మూలింపబడినప్పటికీ, కులవ్యవస్థ బలహీనపడటం లేదు.
కులరహిత సమాజం అంటే కులాల ఆధారంగా వివక్ష, అసమానతలు లేని, అందరూ సమానంగా గౌరవించబడే, కలిసి జీవించే ఒక సామాజిక వ్యవస్థ. కులాంతర వివాహాలు ప్రోత్సహించడం, సామాజిక సమానత్వం కోసం కృషి చేయడం వంటివి అవసరం. అంతిమంగా మానవత్వమే ప్రధానంగా పరిగణించబడే సమాజం కోసం నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరముంది.
సురేశ్ బాబు, 9989988912