07-11-2025 09:38:55 AM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపిస్తూ మంచి స్నేహితుడని పేర్కొన్నారు. గురువారం వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ట్రంప్ భారత్ తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు బలోపేతమే లక్ష్యమని ట్రంప్ వెల్లడించారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు మోదీ క్రమంగా తగ్గిస్తున్నారని ట్రంప్ సూచించారు. వచ్చే ఏడాది భారతదేశానికి వెళతారా అని అడిగినప్పుడు, ట్రంప్, "అవును, కావచ్చు" అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు 2020లో తన చివరి భారత పర్యటనను కూడా గుర్తుచేసుకుంటూ, "నేను ప్రధానమంత్రితో కలిసి అక్కడ గొప్ప పర్యటన చేశాను" అని తెలిపారు. ప్రధాని మోదీ పట్ల ట్రంప్ కు అపారమైన గౌరవం ఉందని, ఇద్దరు నాయకులు తరచుగా మాట్లాడుకుంటామని చెప్పారు. మంగళవారం నాడు భారత్-అమెరికా సంబంధాలపై అడిగిన ప్రశ్నకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సమాధానమిస్తూ, ట్రంప్ ద్వైపాక్షిక సంబంధం గురించి చాలా సానుకూలంగా, బలంగా భావిస్తున్నారని పేర్కొన్నారు.