calender_icon.png 23 October, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా సుంకాలు తగ్గే అవకాశం

23-10-2025 01:17:00 AM

50శాతం నుంచి 15, 16శాతానికే పరిమితం

-త్వరలో భారత్, అమెరికా మధ్య ఇంధన, వ్యవసాయ రంగాలపై కీలక వాణిజ్య ఒప్పందం

వాషింగ్టన్, అక్టోబర్ 22: భారత్, అమెరికా మధ్య ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక వాణిజ్య ఒప్పందం త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా, భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ప్రస్తుతం విధిస్తున్న దాదాపు 50 శాతం సుంకాలను గణనీయంగా తగ్గించి, 15 నుంచి 16 శాతానికి పరిమితం చేయనున్న ట్లు సమాచారం.

ఈ సుంకాల తగ్గింపు ము ఖ్యంగా వస్త్రాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ వంటి కీలక రంగాల్లో భారతీయ ఎగుమతిదారులు అమెరికా మార్కెట్లో మరింత పోటీనిచ్చేందుకు దోహదపడనుంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్ర ధానంగా ఇంధన, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించాలని..

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులను భారత్ క్రమంగా తగ్గించుకోవడానికి అంగీకరించడం, ప్రపంచ ఇంధన సరఫరాపై రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించాలనే వా షింగ్టన్ ప్రయత్నాలకు ఇది అనుగుణంగా ఉంటుంది. దీనికి ప్రతిగా, భారత్ తన మార్కెట్ను అమెరికా వ్యవసాయ ఉత్పత్తులైన నాన్-జనెటికల్లీ మోడిఫైడ్, మొక్కజొన్న, సోయాబీన్ దిగుమతులకు మరింత తెరవాల్సి ఉంటుంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వివాదాలను పరిష్కరించే దిశగా జరుగుతున్న ఈ చర్చలు తుది దశకు చేరుకున్నాయి.

ఈ నెల చివర్లో జరగబోయే ఆసియన్  సదస్సు కంటే ముందే ఒప్పందాన్ని ఖరారు చేసి, అక్కడ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చర్చల్లో పాల్గొంటున్న అధికారులు తెలిపారు. ఈ పురోగతి ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చోటు చేసుకోవడం గమనార్హం. ఈ సంభాషణలో వాణిజ్యం, ఇంధన సహకారంపై ప్రధానంగా చర్చించినట్లు ట్రంప్ విలేకరులకు తెలిపారు.

ఈ ఒప్పందం కుదిరితే, 2020లో సుంకాలను తగ్గించడంపై విభేదాల కారణంగా నిలిచిపోయిన ఇరు దేశాల వాణిజ్య సంబంధాలలో ఇది అత్యం త ముఖ్యమైన ముందడుగు కానుంది. అయితే, రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించాలనే షరతు, ఇంధన భద్రత, భౌగోళిక రాజకీయ అంచనాలను సమన్వయం చేయడంలో భారత్‌కు కొంత సవా లుగా నిలవవచ్చని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.