calender_icon.png 23 October, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: బండి సంజయ్

23-10-2025 02:32:05 PM

హైదరాబాద్: ఘట్‌కేసర్‌లో కాల్పుల ఘటనలో గాయపడిన ప్రశాంత్‌సింగ్‌ (సోను)ని కలవడానికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay ), కె. లక్ష్మణ్, ఇతర బీజేపీ నాయకులతో కలిసి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... గోరక్ష చేస్తున్న ప్రశాంత్  సింగ్ పై కాల్పులు జరపడం బాధాకరం అన్నారు. ఓట్లు, డబ్బుల కోసమో ప్రశాంత్ సింగ్ ఇలా చేశారని చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ గోవులకు, గో రక్షకులకు రక్షణ లేదని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గో రక్షకుల పట్ల తీరు సరిగా లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులే కొట్లాడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నిలబడుతుందా.. కుప్పకూలుతుందా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బండి సంజయ్ పేర్కొన్నారు.

కాగా, గురువారం హైదరాబాద్ శివార్లలోని పోచారం ఐటీ కారిడార్ సమీపంలో గోరక్షక్ బిడ్లా ప్రశాంత్ కుమార్ పై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను మహ్మద్ ఇబ్రహీం ఖురేషి, హసన్బిన్ మోసిన్, కురువ శ్రీనివాస్ గా గుర్తించగా, మరో నిందితుడు మహ్మద్ హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడని రాచకొండ పోలీసులు తెలిపారు. బుధవారం యమ్నంపల్లి సమీపంలో ఇబ్రహీం, అతని సహచరులు సోను సింగ్(ప్రశాంత్ కుమార్) వాహనాన్ని అడ్డగించినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. అక్రమ పశువుల రవాణాకు వ్యతిరేకంగా హిందూ సమూహాలకు సోనుసింగ్ సమాచారం అందించేవాడు. దీంతో ఇబ్రహీం సోను సింగ్‌ పై కక్ష పెంచుకున్నాడు. వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

సోను సింగ్ హిందూ సంస్థలకు, గోరక్ష దళ్‌కు వారి కార్యకలాపాల గురించి సమాచారం ఇచ్చాడని ఇబ్రహీం ఆరోపించాడు. వాగ్వాదం తీవ్రమైంది. దీంతో ఇబ్రహీం తన దగ్గర ఉన్న గన్ తో సోనుపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు. సోను సింగ్‌ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వారు అతన్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని శరీరం నుండి బుల్లెట్‌ను విజయవంతంగా తొలగించారు. అతని పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. ఈ దాడి ఘటనను కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రాంచందర్ రావు, బిజెపి నాయకులు ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుల నుంచి ఒక దేశీయ పిస్టల్, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరం జరిగిన ప్రదేశంలో రెండు ఖాళీ 5 ఎంఎం కార్ట్రిడ్జ్‌లు, సిగరెట్ బడ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.