23-10-2025 01:33:28 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా పార్టీ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సహా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, టి. పద్మారావు, మహ్మద్ మహమూద్ అలీ పాల్గొన్నారు. వీరితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల, క్లస్టర్ల ఇంచార్జులు పాల్గొన్నారు.
వారిలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నేతలు, స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర పార్టీ కీలక నేతలు ఉన్నారు. ఈ సమావేశం సందర్భంగా పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద అధినేత కేసీఆర్(KCR) కు ఇంచార్జీలు రిపోర్ట్ చేయనున్నారు. కాగా, పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించి, అధినేత కేసీఆర్ సమావేశంలో సమీక్షించి నేతలకు దిశానిర్దేశం చేస్తారు.