ఉషా పరిణయం సమాప్తం

28-04-2024 12:05:00 AM

విజయ్‌భాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఉషా పరిణయం’. ‘లవ్ ఈజ్ బ్యూటిఫుల్ ’అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంతో ఆయన తనయుడు శ్రీ కమల్ కథానాయకుడిగా తెరంగేట్రం చేయనున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’, ‘ప్రేమకావాలి’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విజయ్‌భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తాన్వీ ఆకాంక్ష అనే తెలుగు అమ్మాయి కథానాయికగా నటిస్తుంది. 

త్రివిక్రమ్ అభినందనలు 

గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబధించి హీరో శ్రీ కమల్ మరియు సీరత్ కపూర్ లపై ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పాటతో సినిమా చిత్రీకరణ ముగియనుండగా చివరి రోజున ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సెట్స్‌కి విచ్చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. గతంలో విజయ్‌భాస్కర్ కలయికలో అనేక విజయవంతమైన సినిమాలు రూపొందిన విషయం తెలిసిందే. అలీ, వెన్నెల కిశోర్, శివాజీ రాజా, ఆమని, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్ ఆర్ ధృవన్, డీఓపీ: సతీష్ ముత్యాల, ఎడిటింగ్: ఎమ్.ఆర్.వర్మ.