టాక్సిక్ కోసం రెడీ అవుతున్న కియారా

27-04-2024 12:30:00 AM

ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ సినిమాతో బిజీగా ఉంది అందాల తార కియారా అద్వానీ. పాన్ ఇండియా సినిమా అనగానే పరిశీలనకు వచ్చే నాయికలలో ఆమె పేరు కూడా వినిపిస్తుంటుంది. ఆ కోవలోనే ‘వార్ 2’, ‘టాక్సిక్’ చిత్రాల్లో నటించే అవకాశాలన్ని అందిపుచ్చుకుంది. ‘కెజిఎఫ్’ చిత్రాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కన్నడ కథానాయకుడు యష్ హీరోగా ‘టాక్సిక్’ పేరిట ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. యాక్షన్ చిత్రంగా రానున్న ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో కలిపి తన సొంత నిర్మాణ సంస్థ అయిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు యష్. రెండేళ్ళుగా తెరమీద కనపడని యష్ ఈ సినిమాతో ఇప్పుడు బిజీగా గడుపుతున్నారు.

బెంగళూరు పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రీకరణ జరుగనుందని సమాచారం. కాగా ‘గేమ్ చేంజర్’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత, వెంటనే ‘టాక్సిక్’ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు తన కాల్షీట్లను కేటాయించిదట కియారా. వాస్తవానికి ‘వార్ 2’ ముందుగా పట్టాలెక్కినప్పటికీ అందులో ఆమె పాత్ర యొక్క చిత్రీకరణకు ఇంకా సమయం ఉండటంతో ముందుగా ‘టాక్సిక్’ సినిమాలో నటించాలని నిర్ణయిం చుకుంది. భారతీయ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కలిసి నటించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.