22 August, 2026 | 2:01 AM

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మివ్రతం

22-08-2026 12:58 AM

మహబూబాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి స్వరూపంగా వరలక్ష్మీదేవిని భావిస్తూ వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామునే ఇళ్లను శుభ్రం చేసి, పూజా మందిరాలను పుష్పాలు, మామిడి తోరణాలతో అలంకరించారు.

వరలక్ష్మీదేవి ప్రతిమను ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. కలశాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, పుష్పాలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వరలక్ష్మీ వ్రత కథను చదివి, మంగళహారతి ఇచ్చారు. పలు ప్రాంతాల్లో మహిళలు సామూహికంగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

వరంగల్ నగరంలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు ఒకరికొకరు వాయనం, పసుపు, కుంకుమలు అందజేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుటుంబంలో సుఖసంతోషాలు, సంపద, సౌభాగ్యం వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు. పలు ఆలయాల వద్ద భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.