20 March, 2026 | 2:30 AM

భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రి వేడుకలు ప్రారంభం

20-03-2026 12:47 AM

వరంగల్, మార్చి 19 (విజయక్రాంతి): చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని వసంత నవరాత్రులు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం నాలుగు గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన పిమ్మట అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించి అత్యంత సుందరంగా అలంకరణ జరిపారు. అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. 

ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఆలయ కమిటీ చైర్మన్, ధర్మకర్తలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పసుపు రంగు చామంతికా పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ డాక్టర్ బి. శివసుబ్రహ్మణ్యం ధర్మకర్తలు ఓరుగంటి పూర్ణచందర్, మయూరి రామేశ్వరరావు, బింగి సతీష్, పాలడుగుల ఆంజనేయులు, శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. సాయంకాలం దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి అయినవోలు రాధాకృష్ణ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేకమంది భక్తులు పాల్గొన్నారు. ఉగాది పర్వదిన సందర్భంగా అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.

మంగపేట మండలంలో..

మంగపేట, మార్చి 19 ( విజయక్రాంతి ) : ఉగాది పర్వదిన వేడుకలు గురువారం మంగపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలలోని ఆలయాలలో అర్చకులు గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ సమీపంలోని ఆలయాలకు వెళ్లి దైవాన్ని దర్శించుకున్నారు.

ఆలయాలకు విచ్చేసిన భక్తుల గోత్రనామాలతో పూజలు నిర్వహించిన  అర్చకులు అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందించారు. గురువారం సాయంత్రం  మండల కేంద్రంలోని శ్రీ ఉమాచంద్ర శేఖర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు విస్సావజ్జుల నరేష్ శర్మ , కమలాపురంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాపురం వంశీ కుమారాచార్యులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించి, నూతన సంవత్సర ఫలితాలను భక్తులకు వివరించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా మారింది.