6 May, 2026 | 8:37 PM

చెరువు బఫర్ జోన్‌లో వాసవి నిర్మాణాలు

27-04-2024 01:04 AM

ఆధారాలు సమర్పించాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఏప్రిల్ 26(విజయక్రాంతి): మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరు వు బఫర్ జోన్‌లో వాసవి ఇన్ఫ్రా ఎల్‌ఎల్పీ నిర్మాణాలు చేస్తున్నదన్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. బఫర్ జోన్లో నిర్మాణాలు లేవని వాసవి సంస్థ చెప్తున్నదని, చట్ట ప్రకారమే అనుమతి ఇచ్చామని అధికారులు చెప్తున్నారు. బాచుపల్లిలో సర్వే నంబర్ 127/పీ, 128/పీ, 137/ పీలో కోమటికుంట ఎఫ్టీఎల్ ప్రాంతంలో సంస్థ నిర్మాణాలు చేపట్టడాన్ని నిజాంపేట వాసి సతీశ్ దాఖలు చేసిన పిల్‌తో నిర్మాణాలను నిలిపివేస్తూ హెచ్‌ఎండీఏ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సంస్థ దాఖలు చేసిన  వ్యాజ్యాలను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది.

పిటిషనర్ న్యాయవాది టీ వెంకటరాజుగౌడ్ వాదనలు వినిపిస్తూ, అధికారులు తనిఖీ తర్వాత బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేసినట్టు తేల్చిందని అన్నారు. ఇరిగేషన్ శాఖ ఎన్వోసీ ఇచ్చాకే అనుమతులు ఇచ్చామని హెచ్‌ఎండీఏ న్యాయవాది మాధవీరెడ్డి చెప్పారు. బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఉంటే కూల్చేస్తామని వాసవి సంస్థ న్యాయవాది బీ మయూర్‌రెడ్డి చెప్పారు. వాదనల తర్వాత చెరువు ఎఫ్టీఎల్ జోన్‌లో నిర్మాణాలకు ఆధారాలను నివేదించాలని పిటిషనర్‌ను హైకో ర్టు ఆదేశించింది. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.