24 August, 2026 | 4:56 AM

వర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలు

22-05-2024 01:17 AM

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను నియమిస్తూ ఉత్తర్వులు 

జూన్ 15 లోపు కొత్త వీసీల నియామకం

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల వీసీల గడువు ఈనెల 21వ తేదీతో ముగిసింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్‌చార్జి వీసీలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీచేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం లేదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ (ఈ నెల 27) తర్వాత కొత్త వీసీలను నియమించే అవకాశం ఉంది. ఇన్‌చార్జి వీసీలుగా ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారులు బుధవారం ఆయా యూనివర్శిటీల బాధ్యతలను చేపట్టనున్నట్లు సమాచారం.

ప్రస్తుత వీసీల గడువు ముగియడంతో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో హర్షం వ్యక్తం చేస్తూ పలు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు బాణాసంచా కాల్చారు. వీసీలకు వ్యతిరేకంగా ఆందోళనను చేపట్టారు. కాకతీయ వర్సిటీలో వీసీ తాటికొండ రమేశ్ దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. ఈ సందర్భంగా కేయూలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఉస్మానియాలోనైతే విద్యార్థులు స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. వీసీల పదవీకాలం ముగిశాక గతంలో ఎప్పుడూ ఈ విధమైన వాతావరణం యూనివర్సిటీల్లో చోటుచేసుకోలేదు. సమస్యలు పరిష్కరించడంలో వీసీలు విఫలమైనట్లు పలువురు విద్యార్థులు పేర్కొన్నారు.

జూన్ 15లోపు ఎప్పుడైనా కొత్త వీసీలు..

బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021 మే 22న 10 వర్సిటీలకు వీసీలను నియమించింది. దీంతో ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీ యూ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు, అంబేడ్కర్ ఓపెన్, పొట్టి శ్రీరాములు తెలుగు, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్(జేఎన్‌ఏఎఫ్‌ఏ) యూనివర్సిటీల వీసీల పదవీకాలం ఈనెల 21తో మూడేళ్ల గడువు ముగిసింది. దీంతో ఐఏఎస్ అధికారులను ఇన్‌చార్జి వీసీలుగా నియమించి కొత్త వీసీలను నియమించే వరకు లేదా జూన్ 15 వరకు వీరు కొనసాగనున్నట్లు నియామక ఉత్తర్వుల్లో ప్రభుత్వం వేర్వేరుగా తెలిపింది. 

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలోనూ నూతన వీసీలను నియమించినప్పుడు సీనియర్ ఐఏఎస్‌లనే ఇన్‌చార్జి వీసీలుగా నియమించారు. పది, పదిహేను రోజుల్లో యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమించనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ‘విజయక్రాంతి’తో తెలిపారు. జూన్ 15వ తేదీలోపు వీసీల నియామకానికి గడువు ఉందని, ఆలోగా నియమిస్తామని పేర్కొన్నారు. 

పూర్తిస్థాయి వీసీలను నియమించాలి

రాష్ట్రంలో పది యూనివర్శిటీలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను వీసీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం తగదు. పూర్తిస్థాయి వీసీలను తక్షణమే నియమించాలి. ఇన్‌చార్జి వీసీలను నియమించడం వలన వర్సిటీల్లో పరిపాలన వ్యవస్థ కుంటుపడుతుంది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులకు ఇతర శాఖల బాధ్యతలున్నాయి. బుర్రా వెంకటేశంకు ఇప్పటికే విద్యాశాఖతోపాటు అనేక ఇతర శాఖల బాధ్యతలున్నాయి. దీనికితోడూ మళ్లీ జేఎన్టీయూ వీసీగా బాధ్యతలంటే ఎలా? బాసర ట్రిపుల్ ఐటీ యాక్ట్ మార్చి పూర్తిస్థాయి వీసీని నియమించాలి.

 టి.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు

ఇన్‌చార్జి వీసీలు వీరే..

1. జేఎన్టీయూహెచ్ : బుర్రా వెంకటేశం

2. ఉస్మానియా యూనివర్సిటీ : దాన కిషోర్

3. కాకతీయ యూనివర్సిటీ : వాకాటి కరుణ

4. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ : రిజ్వీ

5. తెలంగాణ యూనివర్సిటీ : సందీప్ కుమార్ సుల్తానియా

6. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ : శైలజ రామయ్యర్

7. మహాత్మాగాంధీ యూనివర్సిటీ : నవీన్ మిట్టల్

8. శాతవాహన యూనివర్సిటీ : సురేంద్రమోహన్

9. జేఎన్‌ఏఎఫ్‌ఏ యూనివర్సిటీ : జయేశ్ రంజన్

10. పాలమూరు యూనివర్సిటీ : నదీమ్ అహ్మద్