7 August, 2026 | 2:01 AM

పేరుకే రైతు మార్కెట్

07-08-2026 01:17 AM
  1. వ్యాపారం అంతా రోడ్డుపైనే
  2. వంటిమామిడి రైతు బజార్ ప్రయాణికులకు బేజార్ 
  3. రాజీవ్ రహదారిపైనే కూరగాయల క్రయవిక్రయాలు
  4. అధికారులకు పట్టింపు లేదని ఆరోపణలు
  5. మార్కెట్ ను విస్తరించడంలో అధికారుల నిర్లక్ష్యం
  6. ప్రాణాలకు తృటిలో తప్పుతున్న ముప్పు
  7. చేతులెత్తేసిన పోలీసులు 

గజ్వేల్, ఆగస్టు6 (విజయక్రాంతి): సిద్ధిపేట జిల్లా వంటిమామిడి రైతు బజార్ వద్ద రాజీవ్ రహదారిపైనే కూరగాయల క్రయవిక్రయాలు కొనసాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పక్కనే కాకుండా రోడ్డుపైనే వ్యాపారులు రైతులను ఆపేసి కూరగాయలను కొనుగోలు చేయడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.

పెద్ద రైతులు ర్యాలీ ఆటోలలో తీసుకువచ్చిన కూరగాయలను సైతం వాహనంతో సహా రోడ్డుపైనే ఉంచి విక్రయిస్తున్నారు. దీంతో రోడ్డుపై సగానికి పైగా వాహనాలు నిలిచిపోయి ఉంటున్నాయి.  ఆర్ వి ఎం ఆసుపత్రి నుండి వంటిమామిడి చౌరస్తా వరకు వెళ్లడానికే కిలోమీటర్ కూడా లేని దూరానికి వాహనాలు వెళ్లాలంటే 15 నిమిషాలకు పైగానే సమయం పడుతుంది. ఈ ట్రాఫిక్ సమస్యతో ఇప్పటికే పలుమార్లు రోడ్డు ప్రమాదాలకు గురై ప్రజలు గాయాల పాలయ్యారు.

ప్రధాన రహదారిపై వేగంగా వచ్చే వాహనాల మధ్య ప్రజలు రోడ్డు దాటాల్సి రావడంతో ఎప్పటికప్పుడు ప్రమాదాలు తప్పడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు  నెలల తరబడిగా రైతు మార్కెట్ వద్ద రైతులను వ్యాపారులను నియంత్రించాలని చూసినా సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రహదారిపై జరుగుతున్న క్రయవిక్రయాలను రైతు బజార్ ఆవరణలోనే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అటవీ శాఖ అనుమతులు రాగానే రైతు మార్కెట్‌ను విస్తరిస్తాం 

రైతు మార్కెట్ వద్ద రైతులను, రోడ్డుపై కొనుగోలు చేస్తున్న వ్యాపారులను నియంత్రించడానికి పోలీసుల సహాయంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. కానీ ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. మార్కెట్ కు కేటాయించిన స్థలంలో మామిడి తోట ఉండడం వల్ల తోటను తొలగించడానికి అటవీశాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. అనుమతులు రాగానే మార్కెట్ను విస్తరింపజేసి రైతులను వ్యాపారులను రోడ్డుపైకి రాకుండా చూస్తాం.

- జాన్ వెస్లీ, వంటిమామిడి ఏఎంసీ  కార్యదర్శి