25 April, 2026 | 2:11 AM

మధ్యాహ్నానికే పశువైద్యశాలలు బంద్

25-04-2026 12:35 AM

పట్టించుకోని అధికారులు..రోజు ఇదే తంతు..

తాడ్వాయి, ఏప్రిల్, 24( విజయ క్రాంతి ): గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పశువైద్యశాలలు, పశు వైద్య  ఉప కేంద్రాలను నెలకొల్పింది.ఈ పశు వైద్య కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం  4 గంటల వరకు పనిచేయాలని నిర్దేశించింది.కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పశు వైద్యశాలలు, పశువైద్యం ఉప కేంద్రాలు మధ్యాహ్నానికే  క్లోజ్ అవుతున్నాయి.

అధికారులు తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ పశువైద్య ఉపకేంద్రం, తాడ్వాయిలోని పశువైద్య కేంద్రం మధ్యాహ్నానికే తాళాలు వేసి దర్శనం ఇచ్చాయి. ప్రభుత్వం పశువైద్యశాలపై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న ఫలితం లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజు అధికారులు మధ్యాహ్నానికే ఆసుపత్రులకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారని రైతులు మండిపడుతున్నారు.

 అడిగే వారెవరని  ఇష్టరాజ్యంగా....

అడిగేవారు ఎవరన్నా ధీమాతో పశువైద్య శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం ఆసుపత్రికి వచ్చి పశువులకు చికిత్సలు నిర్వహించి మధ్యాహ్నానికే వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం తర్వాత తమ పశువులకు రోగాలు వస్తే తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత పశువైద్య శాఖ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.

గోపాల మిత్రులతో చికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గోపాల మిత్రులు పశువులకు చికిత్సలు నిర్వహించి డబ్బులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యశాలలు ఉన్న ప్రైవేటు వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని రైతులు వాపోతున్నారు.  ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేయాల్సిన పశువైద్యశాలలు మధ్యాహ్నానికే మూసి వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

రైతులకు పశువైద్యశాలలు ఎంతో సౌకర్యవంతంగా ఉండాలి కానీ అధికారులు సమయ సారిని పాటించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత పశువులకు ఏమైనా రోగాలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మండలంలోని ఎర్రపహాడు, కన్కల్ గ్రామాల్లో పశువైద్య ఉప కేంద్రాలు ఉండగా, తాడ్వాయి,కరడ్పల్లి గ్రామాల్లో పశువైద్య కేంద్రాలు కొనసాగుతున్నాయి.

నాలుగు కేంద్రాలు సైతం మధ్యాహ్నం వరకే పని చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ఒక్క తాడువాయి మండలంలోనే కాకుండా కాకుండా జిల్లాలోని గాంధారి, లింగంపేట, రాజంపేట, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్,పిట్లం, బిచ్కుంద,నాగిరెడ్డిపేట మండలాల్లో సైతం కొన్ని పశువైద్యశాలలు సక్రమంగా సమయాన్ని పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పశు వైద్యశాలలు సమయం పాటించేలా చర్యలు తీసుకోవాలని  రైతులు కోరుతున్నారు.