calender_icon.png 28 October, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో గ్రామపాలన అధికారి

28-10-2025 12:50:31 AM

-రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి

-పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.60 వేలు డిమాండ్

-తొలి విడతగా అధికారికి రూ.30 వేలు పోన్ పే ద్వారా చెల్లించిన రైతు

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంలో ఘటన 

ములకలపల్లి, అక్టోబర్ 27 (విజయక్రాంతి): రైతు నుంచి రూ 15వేలు లంచం తీసుకుంటూ సోమవారం గ్రామ పాలన అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేష్ కథనం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామపాలన అధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ ఓ రైతుకు చెందిన సర్వే నెంబర్ 254/ఆఆలో 2.30 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం కోసం రైతు నుంచి రూ 60 వేలు డిమాండ్ చేశారు.

సంబంధిత రైతు తొలి విడతగా రూ 30 వేలను ఫోన్ పే ద్వారా చెల్లించారు.మరో రూ 10 వేలను నగ దు రూపంలో అందజేశారు. ఇంతకుమించి మేము ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని రైతు గ్రామ పాలన అధికారిని వేడుకున్నప్పటికీ మిగతా రూ 20వేలు ఇస్తేనే పని అవు తుందని చెప్పడంతో విసుగు చెందిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు రూ 20వేల నుంచి సోమవారం రూ.15వేలు ములకలపల్లి తహసీ ల్దార్ కార్యాలయంలోనే జీపీఏ శ్రీనివాస్ నాయక్ ఆ రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. 

శ్రీనివాస్ నాయక్‌పై కేసు నమోదు చేసి రిమాండ్ కోసం వరంగల్‌లోని ఏసీబీ కోర్టు కు తరలించారు.పనులు చేయడానికి ప్రజల నుంచి ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఎవరైనా లంచం తీసుకున్న అడిగిన తమకు ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డీఎస్పీ రమేష్ కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, వాట్సాప్ నెంబర్ 9440 446106 సంప్రదించి అవినీతి అధికారుల,సిబ్బంది సమాచారం అందించాలని సూచించారు.