4 June, 2026 | 12:47 AM

గ్రామ, వార్డుసభలు సమర్థవంతంగా నిర్వహించాలి

04-06-2026 12:08 AM

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, జూన్ 3 (విజయ క్రాంతి) ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో గ్రామ, వార్డు సభలు సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయం నుండి  రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో అన్ని గ్రామపంచాయతీలు, 

మున్సిపాలిటీలలోని  వార్డులలో  నిర్వహించనున్న సభలకు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. సభలలో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి కుటుంబం మొక్కలు నాటేలా అవగాహన కల్పించాలని సూచించారు. రహదారుల చుట్టు పెరిగిన  పిచ్చి మొక్కలు తొలగించి అవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు నాటాలని తెలిపారు. 

మురుగుకాల్వలు పరిశుభ్రం చేయుట, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఇండ్ల నుండి వచ్చే మురుగునీరు రోడ్లపైకి వెళ్లకుండా కమ్యూనిటి, వ్యక్తిగత ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.  ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. గ్రామసభలలో  మహిళల రక్షణ, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల నివారణ, రహదారి భద్రతపై అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రానున్న వర్షాకాలంలో గ్రామాలలో పారిశుధ్యం, మురుగు కాలువల శుభ్రత, ప్లాస్టిక్ వ్యర్ధాల తొలగింపు, భారీ అకాల వర్షాల వల్ల  వాగులు వంకలు పొంగితే తీసుకోవాల్సిన రక్షణ చర్యలు  ప్రజలను తరలించేందుకు అవగహన కల్పించాలని  తెలిపారు.

వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను సిద్ధం చేసుకోవాలని, రాష్ట్ర, కేంద్ర ప్రకృతి విపత్తుల ప్రతిస్పందన బృందాలను, రెస్క్యూ బృందాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు.  ఎన్ లినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపధ్యంలో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పంటల అవశేషాలు కాల్చొద్దని దాని వల్ల భూమిలో ఉన్న పోషకాలు చనిపోతాయని కలియదున్నడం వల్ల భూమికి బలం పెరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా, విద్యుత్,  విద్య, ప్రణాళిక, తదితర శాఖల అధికారులతో పాటు అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపిడివోలు, ఎంఈవోలు, తదితరులు పాల్గొన్నారు